
కేంద్ర మంత్రికి ట్వీట్.. తక్షణమే సాయం
జైపూర్: కష్టాల్లో ఉన్న ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్కు రైల్వే శాఖ తక్షణం స్పందించి సాయం చేసిన సంఘటన మరొకటి వెలుగు చూసింది. అతను దిగాల్సిన రైల్వే స్టేషన్లో సిబ్బంది ముందే ప్లాట్ఫామ్ పైకి చేరుకుని సాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి.
కర్ణాటకలో స్థిరపడ్డ రాజస్థాన్ వ్యాపారవేత్త పంకజ్ జైన్ కుటుంబంతో కలసి యశ్వంత్పూర-బికనూర్ ఎక్స్ప్రెస్ రైల్లో సొంతూరుకు వెళ్తున్నాడు. పక్షవాతం సోకిన తండ్రి.. తల్లి,సోదరీమణులు అతనితో పాటు ప్రయాణిస్తున్నారు. పంకజ్ రాజస్థాన్లోని మెర్టా రోడ్ రైల్వే స్టేషన్లో దిగాలి. అక్కడ ఐదు నిమిషాలు మాత్రమే రైలు ఆపుతారు. ఈలోగా తండ్రిని, లగేజీని దించడం ఎలాగా అని ఆందోళన చెందాడు. మిత్రుల సలహా మేరకు తన సమస్యను తెలియజేస్తూ కేంద్ర మంత్రి సురేష్ ప్రభుకు, ఇండియన్ రైల్వేస్కు ట్వీట్ చేశారు. ఐదు నిమిషాల్లోపు రైల్వే శాఖ స్పందించి.. అతను ప్రయాణిస్తున్న కోచ్ నెంబర్, పీఎన్ఆర్ నెంబర్ పంపాలని సూచించింది. మెర్టా రోడ్ స్టేషన్కు రైలు చేరేసరికి ప్లాట్ఫామ్పై స్టేషన్ మాస్టర్, సిబ్బంది, ఓ కూలి.. వీల్ చైర్తో సిద్ధంగా ఉన్నారు. రైలును పది నిమిషాల పాటు ఆపి పంకజ్ కుటుంబ సభ్యులకు సాయపడ్డారు. రైల్వే శాఖ పనితీరుకు మొదట్లో ఆశ్చర్యపోయిన పంకజ్ వారి సేవలకు కృతజ్ఞతలు చెప్పాడు. ఇటీవల రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ.. తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేయగా.. వెంటనే స్పందించిన అధికారులు ఆమెకు పోలీసుల రక్షణ కల్పించారు.