'ఆయన కూడా అలాగే చెప్పేవారు'
న్యూఢిల్లీ: రెండేళ్ల పాలనలో అన్నివర్గాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రతువుగా మారారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అన్నివర్గాలు అభద్రతా భావంతో బతుకుతున్నాయని ధ్వజమెత్తారు. మన్మోహన్ సింగ్ మాదిరిగానే మోదీ వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
'అతినీతిపరున్ని కాదని మన్మోహన్ సింగ్ చెప్పేవారు. తన హయాంలో కుంభకోణాలపై మౌనంగా ఉండేవారు. మోదీ కూడా ఇలాగే వ్యవహరిస్తున్నారు. వ్యాపమ్, డీడీసీఏ, లలిత్ గేట్ స్కాములపై మోదీ సైలెంట్ గా ఉన్నార'ని కేజ్రీవాల్ విమర్శించారు. కేంద్రంలో మోదీ పాలనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా కేజ్రీవాల్ ట్విటర్ లో పలు ప్రశ్నలు సంధించారు.
* కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తామని, జడ్జిల సంఖ్య రెట్టింపు చేస్తామని రెండేళ్ల క్రితం హామీయిచ్చారు. న్యాయమూర్తులు కన్నీళ్లు పెట్టుకున్నా మీరు కార్యాచరణ ప్రారంభించలేదు.
* దళితులందరికీ విద్య అందిస్తామని రెండేళ్ల క్రితం వాగ్దానం చేశారు. రోహిత్ వేముల ఆత్మహత్యపై కనీసం స్సందించలేదు.
* రైతులకు పెట్టుబడుల్లో కనీసం 50 శాతం లాభం వచ్చేట్టు చేస్తామని చెప్పారు. అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నా చేష్టలుడిగి చూస్తున్నారు.
* బ్యాంకుల నిరర్ధక ఆస్తులు తగ్గిస్తామని హామీయిచ్చారు. కానీ విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోవడానికి అనుమతించారు.
* పాలన ప్రధానికే పరిమితం కాదని, ముఖ్యమంత్రుల సలహాలు తీసుకుంటామని రెండేళ్ల క్రితం అన్నారు. కానీ ముఖ్యమంత్రులను అస్థిర పరిచేందుకు కుట్రలు చేస్తున్నారు.