'సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా'
'సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక హోదా'
Published Fri, Feb 21 2014 1:47 AM | Last Updated on Tue, Jul 24 2018 1:12 PM
రాజ్యసభలో ప్రధాని మన్మోహన్ ప్రకటన
రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు
రాయలసీమ, ఉత్తరాంధ్రలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు..
పోలవరం ప్రాజెక్టును మేమే పూర్తిచేస్తాం.. సీమాంధ్ర తొలి ఏడాది ఆదాయ లోటు కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ
తెలంగాణ ఏర్పాటుకే కాదు.. సీమాంధ్ర సంక్షేమానికీ కట్టుబడ్డాం
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక మిగిలే పదమూడు జిల్లాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ప్రకటించారు. రాజ్యసభలో రాష్ట్ర పనర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ చివర్లో ఆయన మాట్లాడారు.. ఈ సందర్భంగా ఆయన చేసిన ప్రకటన పూర్తి పాఠమిదీ.. ‘‘ప్రతిపక్ష నాయకుడు, మాట్లాడిన ఇతర సభ్యులందరు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ సభ్యులు వెల్లడించిన అభిప్రాయాలను నేను చాలా జాగ్రత్తగా విన్నాను. రాష్ట్రానికి చెందిన అన్ని ప్రాంతాలు, ప్రత్యేకించి సీమాంధ్ర ప్రాంత ఆందోళనలను పరిష్కరించేందుకు మా ప్రభుత్వం తీసుకోబోయే నిర్దిష్ట చర్యలను హోంమంత్రి ఇప్పటికే ప్రస్తావించారు. దీనికి సంబంధించి నేను మరికొన్ని ప్రకటనలు చేయదలచుకున్నాను.
మొదటిది.. రాయలసీమ నాలుగు జిల్లాలు, ఉత్తర కోస్తాంధ్ర మూడు జిల్లాలతో పాటు 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర సహాయం అవసరాల కోసం ఐదేళ్ల కాలం పాటు ప్రత్యేక విభాగం హోదా అందించటం జరుగుతుంది. ఇది.. రాష్ట్ర ఆర్థికవ్యవస్థను బలోపేతం చేస్తుంది.
రెండోది.. విభజన తర్వాత ఏర్పడే రాష్ట్రాల్లో పారిశ్రామికీకరణ, ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు.. రెండు రష్ట్రాలకూ పన్ను ప్రోత్సాహకాలు (రాయితీలు) అందించటం సహా కేంద్రం తగిన ద్రవ్య సంబంధమైన చర్యలు తీసుకుంటుందని బిల్లు ఇప్పటికే చెప్తోంది. ఈ ప్రోత్సాహకాలు పలు ఇతర రాష్ట్రాలకు అందిస్తున్న తరహాలోనే ఉంటాయి.
మూడోది.. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు, ప్రత్యేకించి రాయలసీమ, ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు ఉంటాయని బిల్లులో ఇప్పటికే ఉంది. ఈ అభివృద్ధి ప్యాకేజీలు.. ఒడిషాలోని కే-బీ-కే (కోరాపుట్ - బోలాంగిర్ - కలహండి) ప్రత్యేక ప్రణాళిక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలోని బుందేల్‌ఖండ్ ప్రత్యేక ప్యాకేజీల తరహాలో ఉంటాయి.
నాలుగోది.. పోలవరం ప్రాజెక్టు కోసం పునరావాసం, పునర్నిర్మాణం సాఫీగా, పూర్తిగా జరిగేందుకు ఇంకా ఏవైనా సవరణలు అవసరమైన పక్షంలో.. వాటిని సత్వరమే చేపడతామని గౌరవనీయులైన సభ్యులకు నేను హామీ ఇవ్వదలచుకున్నా. పోలవరం ప్రాజెక్టును మా ప్రభుత్వం నిర్మిస్తుంది- దీనిపై ఎలాంటి సందేహం అవసరం లేదు.
ఐదోది.. నోటిఫై చేసిన తేదీ తర్వాత సిబ్బంది, ఆర్థిక రంగం, ఆస్తులు, అప్పుల పంపకాలకు సంబంధించి సన్నాహక పనులను సంతృప్తికరంగా పూర్తిచేయటానికి వీలుగా కొత్త రాష్ట్రం ఏర్పాటు తేదీ (అపాయింటెండ్ డే)ని ఖరారు చేయటం జరుగుతుంది.
ఆరోది.. విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొట్టతొలి ఏడాది.. ప్రత్యేకించి కొత్త రాష్ట్రం ఏర్పాటు తేదీ నుంచి 14వ ఆర్థిక సంఘం సిఫారసులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించే కాలం వరకూ.. తలెత్తే ఆదాయ లోటును 2014-15 సంవత్సరపు కేంద్ర ప్రభుత్వ సాధారణ బడ్జెట్ నుంచి భర్తీ చేయటం జరుగుతుంది.
ఈ అదనపు ప్రకటనలు.. కేవలం తెలంగాణ ఏర్పాటుకు మాత్రమే కాకుండా.. సీమాంధ్ర సుసంపన్నత, సంక్షేమం కొనసాగటానికి మా అచంచల నిబద్ధతను వెల్లడిస్తుందని నేను ఆశిస్తున్నా.’’
Advertisement