`శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు ఆమోదం`
హైదరాబాద్: ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో గురువారం జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో కేంద్ర కేబినెట్ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయాన్ని ప్రకటించడంతో సీమాంధ్రలో నిరసనలు వ్యక్త మైయ్యాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ఏర్పాటుకు నిరసనగా సీమాంధ్ర జిల్లాలో వైఎస్సార్ సీపీ 72గంటల పాటు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా, కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి సాక్షి టీవీ ఇంటర్యూలో మాట్లాడుతూ వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు కేంద్ర ఆమోదం తెలుపనున్నట్టు పేర్కొన్నారు. ఈ సమావేశంలో పల్లంరాజు, కావూరి సాంబశివరావులు సీమాంధ్ర తరపునా తమ అభ్యంతరాలను తెలిపగా, తాను మాత్రం తెలంగాణ వాణిని బలంగా వినిపించినట్టు చెప్పారు. కేంద్ర కేబినెట్‌లో పాల్గొన్న మంత్రులందరు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ మాత్రం తెలంగాణాకు ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించింది. అయితే 2004లోనే ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు హమీ ఇచ్చిందని.. దానిని ఇప్పుడు అమలుచేస్తున్నామని ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పినట్టు జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు మంత్రులు శరద్‌పవార్, అజిత్‌సింగ్‌లు కూడా తమ మద్దతను ప్రకటించారు. ఇకపై తెలంగాణకు ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తామని జైపాల్ రెడ్డి తెలిపారు.