సంస్కరణలతోనే రాజకీయ వాస్తవికత
ఐరాస సర్వసభ్య సమావేశంలో ప్రసంగం న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అభివృద్ధి చెందుతున్న దేశాలకు శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాలు కల్పించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని మన్మో„హన్ సింగ్ ఉద్ఘాటించారు. దాని కోసం వెంటనే ఐరాసలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు. అప్పుడే ప్రస్తుత రాజకీయ వాస్తవికత వెల్లడవుతుందన్నారు. శనివారం ఐక్యరాజ్యసమితి సర్యసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. భద్రతా మండలి పునర్నిర్మాణం, అందులో సభ్యత్వం కోసం భారత్ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు. అయితే దానికి చైనా మోకాలడ్డుతోందన్నారు. మండలిలో వివిధ దేశాలకు భాగస్వామ్యం కల్పించాలని, అది కూడా భవిష్యత్‌కు చాలా అవసరమని చెప్పారు.
బహుళ దేశాల భాగస్వామ్యం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల భద్రతకు భరోసా లభిస్తుందని తెలిపారు. ఐరాసలో సంస్కరణలకు అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం రావాలన్నారు. భద్రత గురించి ఐరాసపై ఉన్న అనుమానాలు తొలగాలంటే సంస్కరణలు తప్పనిసరి అని చెప్పారు. ఉగ్రవాదాన్ని అణచి వేయడానికి ఐరాస మరింత నిబద్ధతతో పనిచేయాలన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చే దేశాలపై ఎలాంటి ఉపేక్ష చూపించరాదన్నారు. విశ్వశాంతి, భద్రత కోసం సంక్లిష్టమైన సవాళ్లను అదిగమించడానికి, అది సైబర్ నేరాలైనా, ఉగ్రవాదమైనా అంతర్జాతీయ ఏకాభిప్రాయం రావాలన్నారు. ఇదే సందర్భంలో ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా ఉన్న పాకిస్థాన్‌పై కూడా నిప్పులు చెరిగారు. భారత దేశంలో జమ్మూ కాశ్మీర్ అంతర్భాగమేనని నొక్కి చెప్పారు. ఈ విషయంలో ఎవరి జోక్యాన్ని తాము సహించబోమన్నారు. పాక్ భూభాగంపై రూపుదిద్దుకుంటున్న ఉగ్రవాద కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలన్నారు. అయితే కాశ్మీర్‌తో సహా ఇతర సమస్యలను దై్వపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని చెప్పారు.
అది కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్రవాద కార్యక్రమాలపైనే అధారపడి ఉంటుందని చెప్పారు. కాగా, పేదరికాన్ని పారదోలడానికి అత్యంత ప్రాధాన్యత నివ్వాలని సభ్య దేశాలకు సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మందిపైగా పేదరికంలో మగ్గుతున్నారని, వారికి నేరుగా సంక్షేమ పథకాలు అందచేయడం ద్వారా పేదరికం తగ్గించాలన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వనరులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆయా దేశాలకు ఐరాస అందించాలని సూచించారు. ఇక సిరియా సంక్షోభం గురించి మాట్లాడుతూ.. ఆ సమస్యకు మిలటరీ చర్యలు పరిష్కారం కాదని చెప్పారు. దీనిని పరిష్కరించడానికి బహుళ దేశాల సదస్సును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. అయితే రసాయన ఆయుధాల వినియోగాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఇజ్రాయెల్, పాలస్తీనా సమస్యను దై్వపాక్షికంగానే పరిష్కరించుకోవాలన్నారు. ఇక అణు నిరాయుధీకరణకు అన్ని దేశాలు పూర్తిగా అంగీకరించాలని, నిర్ణీత కాలంలో, వివక్ష లేకుండా అది పూర్తి చేయాలని కోరారు.