ఆయుధాలు ప్రదర్శించిన మావోలు
సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి అనంతరం విజయోత్సవ సభ
చింతూరు: తీవ్రవాదుల నుంచి ఆయుధాలు, మందుపాతర్లు స్వాధీనం చేసుకున్నప్పుడు పోలీసులు వాటిని ప్రదర్శించడాన్ని మనం చూస్తుంటాం. ఇందుకు భిన్నంగా ఛత్తీస్‌గఢ్ పోలీసుల నుంచి అపహరించిన ఆయుధాలు, మందు గుండు సామగ్రిని మావోయిస్టులు ప్రజల ఎదు ట ప్రదర్శించారు. ఆ చిత్రాలను ఛత్తీస్‌గఢ్ మీడియాకు మావోయిస్టు సానుభూతిపరులు విడుదల చేశారు.
గత నెల 24న సుక్మా జిల్లా బుర్కాపాల్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి చేసిన మావోయిస్టులు 25 మందిని హతమార్చి పలు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని అపహరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన అనంతరం మావోయిస్టులు గత నెల 27న సుక్మా జిల్లాలోని సాలాతోంగ్ అనే గ్రామం వద్ద భారీ విజయోత్సవ సభ నిర్వహించారు. బుర్కాపాల్ ఘటనకు మాస్టర్‌మైండ్ అయిన మిలట్రీ బెటాలియన్ కమాండర్ హిడ్‌మా ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో అపహరించిన ఆయుధాలను ఆదివాసీలకు ప్రదర్శించినట్లు మావోయిస్టులు తెలిపారు.