పోలీసులపై పంజా | Maoists kill 16 in attack on police | Sakshi
Sakshi News home page

పోలీసులపై పంజా

Published Wed, Mar 12 2014 6:09 AM | Last Updated on Sat, Aug 11 2018 9:02 PM

పోలీసులపై పంజా - Sakshi

పోలీసులపై పంజా

ఛత్తీస్‌లో మావోల దుశ్చర్య  16 మంది మృతి
 చింతూరు, (ఖమ్మం), మల్కన్‌గిరి (ఒడిశా), న్యూస్‌లైన్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. గతేడాది ఆ రాష్ట్ర కాంగ్రెస్ అగ్ర నాయకుల కాన్వాయ్‌పై విరుచుకుపడి 25 మందిని మట్టుబెట్టిన సుక్మా జిల్లా దర్బాఘాట్ సమీపంలో మంగళవారం పట్టపగలే (సుమారు 10 గంటలకు)పోలీసు బృందంపై మెరుపుదాడి చేశారు. సుమారు 300 మంది మావోయిస్టులు తొలుత మందుపాతర పేల్చి, ఆపై కాల్పులు జరిపి 16 మందిని హతమార్చారు. మృతుల్లో 11 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, నలుగురు పోలీసులు, ఓ పౌరుడు (వాహన డ్రైవర్) ఉన్నారు. సుమారు మూడు గంటలపాటు హోరాహోరీగా జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్ తరలించారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న 32 మంది తమ క్యాంపులకు చేరుకున్నట్లు తెలిసింది.
 
 వ్యూహాత్మకంగానే దాడి...
 జగదల్‌పూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే 30వ నంబర్ జాతీయ ర హదారిపై దర్బాఘాట్ సమీపంలో పనులు చేస్తున్న కాంట్రాక్టర్ల వాహనాలను తొలుత తగలబెట్టిన మావోయిస్టులు ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు తప్పకుండా వస్తారన్న వ్యూహంతో వారి కోసం మాటువేశారు. అనుకున్నట్లుగానే రహదారి పనుల రక్షణ నిమిత్తం దర్బా, తోంగ్‌పాల్ సీఆర్‌పీఎఫ్ క్యాంప్‌ల నుంచి 30 మంది సీఆర్పీఎఫ్, 20 మంది డిస్ట్రిక్ట్ ఫోర్స్ పోలీసులతో కూడిన రోడ్ ఓపెనింగ్ పార్టీ అక్కడకు బయలుదేరింది. తహక్‌వాడ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో మాటువేసిన మావోయిస్టులు, పోలీసుల రాకను గమనించి ముందుగా మందుపాతర పేల్చారు. అనంతరం ఒక్కసారిగా పోలీసులపై కాల్పులకు దిగడంతో తేరుకున్న పోలీసులు సైతం ఎదురుకాల్పులు ప్రారంభించారు. ఇరువర్గాల నడుమ భారీగా ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
 
 మృతులు వీరే...
 ఈ కాల్పుల్లో సీఆర్పీఎఫ్ 80వ బెటాలియన్‌కు చెందిన ఇన్‌స్పెక్టర్ టీ.ఆర్.సింగ్, సబ్ ఇన్‌స్పెక్టర్ సుభాష్‌సింగ్, ఏఎస్‌ఐ మన్మోహన్‌సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు అఫ్జల్‌హక్, లచ్చిందర్‌సింగ్, కానిస్టేబుళ్లు ప్రదీప్‌కుమార్, మనోజ్ బారెట్, నీరజ్‌కుమార్, నహర్‌సింగ్, కౌశల్‌కిషోర్, సోమ్‌నాధ్ రాథోడ్, డిస్ట్రిక్ట్ ఫోర్స్‌కు చెందిన హెడ్ కానిస్టేబుల్ నకుల్‌ధ్రువ్, కానిస్టేబుళ్లు ఇషూపిస్దా, రాజేంద్ర గైక్వాడ్, ఆదిత్య సాహు, వాహన డ్రైవర్ (పౌరుడు) విక్రమ్ నిషాద్ మృతిచెందారు. కాల్పుల అనంతరం జవాన్లకు చెందిన మూడు గ్రెనేడ్ లాంచర్లు, ఒక ఏకే 47, ఐదు ఏకేఎంలు, నాలుగు ఇన్సాస్ రైఫిళ్లు, ఒక ఎల్‌ఎంజీ, డిస్ట్రిక్ట్ ఫోర్స్‌కు చెందిన రెండు ఎస్‌ఎల్‌ఆర్‌లు, మూడు ఇన్సాస్ రైఫిళ్లను మావోయిస్టులు ఎత్తుకెళ్లారు. కాగా, ఘటన అనంతరం ఓ జవాను మృతదేహంలో మవోయిస్టులు బాంబు అమర్చగా బాంబు నిర్వీర్య బృందం దానిని నిర్వీర్యం చేసింది.  
 
 నాటి వ్యూహకర్తలే నేటి సూత్రధారులు
 సాక్షి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మావోయిస్టు నేతలే ఈ దాడికి వ్యూహం పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న అలియాస్ రావుల శ్రీనివాస్ (వరంగల్), మిలీషియా కమిటీల ఇన్‌చార్జి కణితి పాపారావు అలియాస్ విజయ్ (వాజేడు), డీకేఎస్‌జేసీ సీనియర్ సభ్యుడు పాక హనుమంతు అలియాస్ ఊకే గణేష్ (నల్లగొండ)తో పాటు దర్భా డివిజన్ కమిటీ కార్యదర్శి మనీలా (ఛత్తీస్‌గఢ్) నేతృత్వంలో 150 మందికి పైగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులకు సమాచారం ఉంది. గత ఏడాది దర్భాఘాట్‌లో కాంగ్రెస్ నేతలపై దాడిలో కూడా రామన్న, పాపారావులు కీలక పాత్ర వహించినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా చింతల్‌నార్ వద్ద 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడి హతమార్చిన ఘటనలో వీరిద్దరే కీలకపాత్ర పోషించారు.
 
 దాడిపై రాష్ట్రపతి ఆగ్రహం
 మావోయిస్టుల దాడిపై పార్టీలు ఆగ్రహోదగ్రమయ్యాయి. బాధితులకు సానుభూతి తెలిపాయి. దాడిపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కూడా తీవ్ర ఆగ్రహం, విచారం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉన్న జవాన్లపై చేసే ఇలాంటి దాడులను ఉక్కుపాదంతో అణచాలని ఛత్తీస్ గవర్నర్ శేఖర్ దత్‌కు లేఖ రాశారు. నక్సల్స్‌ను దీటుగా ఎదుర్కొంటామని కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. నక్సల్ దాడి పిరికిపంద చర్య అని బీజేపీ నేత, ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ పేర్కొనగా, మతిలేని హింసాత్మక చర్య అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కాగా, లోక్‌సభ ఎన్నికలను ప్రభావితం చేయడానికే నక్సల్స్ దాడి చేశార ని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్  వ్యాఖ్యానించగా, శాంతిభద్రతల బాధ్యత రాష్ట్రానిదే అని, అందులో వైఫల్యం ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement