ఆవుదూడను చంపావ్‌.. ప్రాయశ్చిత్తంగా కూతుర్ని..! | Marry Minor Daughter To Atone For Accidentally Killing A Calf In MP | Sakshi
Sakshi News home page

ఆవుదూడను చంపావ్‌.. ప్రాయశ్చిత్తంగా కూతుర్ని..!

Published Sun, Feb 16 2020 6:47 PM | Last Updated on Sun, Feb 16 2020 7:00 PM

Marry Minor Daughter To Atone For Accidentally Killing A Calf In MP - Sakshi

భోపాల్‌: ప్రమాదవశాత్తు దూడ చావుకు కారణమైన ఓ వ్యక్తికి గ్రామపంచాయతీ పెద్దలు విచిత్రమైన శిక్ష విధించారు. తన సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాలని ఆ గ్రామపంచాయతీ పెద్దలు ఆదేశించారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా వెంటనే సొంత కూతురుని వివాహం చేసుకుంటే పాపపరిహారం అవుతుందని సెలవిచ్చారు. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా పతారియాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బైక్‌పై వెళ్తుండగా దూడ అడ్డం రాగా.. బైక్‌ అదుపు తప్పి ప్రమాదవశాత్తు దూడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దూడ మరణించింది. అయితే దూడ చనిపోవడానికి అతడే కారణమని పంచాయతీ పెద్దలు తీర్మానం చేసి  పరిహారం చేసుకోవాలని చెప్పారు.

దీంతో ఆ వ్యక్తి యూపీ వెళ్లి గంగానదిలో స్నానం చేసి వచ్చి.. ఊరిలో వాళ్లందరికీ అన్నదానానికి సిద్ధమయ్యాడు. ఇది అంతా పట్టించుకోని పంచాయతీ పెద్దలు తన  సొంత మైనర్‌ బిడ్డనే పెళ్లి చేసుకోవాలంటూ ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా పెళ్లి  ఏర్పాట్లు కూడా చేశారు. ఈ విషయంపై పోలీసులకు కొందరు ఫిర్యాదు చేయడంతో కొంత మంది అధికారులు పతారియా గ్రామానికి వచ్చారు. మైనర్‌కు పెళ్లి చేయడం నేరమని చెప్పినా పంచాయతీ పెద్దలు వినిపించుకోలేదు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆ అమ్మాయి ఆధార్‌ కార్డు తెప్పించి చూసి ఆమె వయస్సు 14 సంవత్సరాలుగా నిర్ధారించి మైనర్‌కు పెళ్లి చేయవద్దని తల్లిదండ్రులను, గ్రామపెద్దలను గట్టిగా హెచ్చరించారు. అయితే ఈ విషయంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

దీనిపై పతారియా పోలీస్‌ స్టేషన్‌ సీఐ మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాలు ఎక్కువని చెప్పారు. ఆవు దూడను చంపితే పరిహారం తప్పనిసరిని భావిస్తారని తెలిపారు. మరికొన్ని చోట్ల ఆవును గానీ, దూడను గానీ చంపితే.. కన్యాదానం చేస్తేనే ఆ పాపం పోతుందని నమ్ముతారన్నారు. అందుకే సొంత బిడ్డనే పెళ్లి చేసుకోవాల్సిందిగా తీర్పులు ఇస్తారని చెప్పారు. ఆ బిడ్డ చిన్న పాప అయినా సరే ఆచారాన్ని అమలు చేసి తీరుతారని.. వీటిని మార్చేందుకు కృషి చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement