‘మతమార్పిడి’పై పట్టువీడని ప్రతిపక్షం
- ఉభయ సభలను అడ్డుకున్న విపక్షాలు
న్యూఢిల్లీ: మత మార్పిడుల అంశంపై సోమవారం రాజ్యసభ కార్యకలాపాలు స్తంభించగా.. లోక్‌సభలో ప్రకంపనలు సృష్టించింది. మత మార్పిడుల అంశం రాష్ట్రాల పరిధిలోనిదని, వాటితో ప్రభుత్వానికి, బీజేపీకి సంబంధం లేదని ప్రభుత్వం తరఫున పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు ఇచ్చిన సమాధానం విపక్షాలను తృప్తి పర్చలేదు. గత వారపు తమ నిరసనను కొనసాగిస్తూ ప్రతిపక్షాలు రాజ్యసభలో సోమవారం ఉదయమే ఈ అంశాన్ని లేవనెత్తాయి.
దానికితోడు బీజేపీ ఎన్నికల హామీలైన నల్లధనం వెలికితీత, ఉపాధి కల్పనలపై నినాదాలు చేస్తూ, ‘ప్రధాని జవాబివ్వండి’, ‘పీఎంజీ, నల్లధనం వెనక్కు తెండి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాంగ్రెస్, ఎస్పీ, జేడీయూ, టీఎంసీ సభ్యులు సభలో గందరగోళం సృష్టించారు. ‘నో పీఎం.. నో హౌజ్’ అంటూ కాంగ్రెస్ సభ్యులు జతకలిసి సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. చర్చ పూర్తయినందున మరోసారి దీనిపై చర్చ సాధ్యం కాదని అధికారపక్ష నేత అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు.
ప్రధాని సభకు వచ్చి మతమార్పిడులపై సభ్యుల ఆందోళనలకు సమాధానమివ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలన్న వెంకయ్య అభ్యర్థనను విపక్షం చెవిన పెట్టలేదు. ఉదయం నుంచీ మధ్యాహ్నం 3 గంటల వరకు నాలుగు సార్లు వాయిదా పడిన సభ.. విపక్షాలు శాంతించకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. ఈ వివాదం లోక్‌సభనూ కుదిపేసింది. ప్రధాని జవాబివ్వాలన్న కాంగ్రెస్, వామపక్షాలు, ఆర్జేడీ, జేడీయూ సభ్యుల నిరసనలు రెండు సార్లు సభ వాయిదాకు కారణమయ్యాయి.
మీది గాంధీ పరివార్.. నాది సంఘ్ పరివార్
ఆరెస్సెస్ నేపథ్యం తనకు గర్వకారణమన్న వెంకయ్య ఇటీవలి వ్యాఖ్యలను ఖర్గే గుర్తు చేశారు. దాంతో.. ‘మీకు గాంధీ పరివార్(కుటుంబం) గర్వకారణం. నాకు సంఘ్‌పరివార్ గర్వకారణం’ అని వెంకయ్య వ్యంగ్యంగా బదులిచ్చారు. ‘వెంకయ్య కుర్చీలో స్ప్రింగ్‌లున్నాయేమో, మాటిమాటికీ లేచి నిల్చుని మాట్లాడుతున్నార’న్న ఖర్గే వ్యాఖ్యపై.. ‘మాది క్రియాశీల ప్రభుత్వం. విపక్ష వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకున్నా జవాబిస్తున్నాం’ అని అన్నా రు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా విపక్షాలు వా కౌట్ చేశాయి. కాగా, ఈ వివాదానికి ముగింపు ఏ విధంగా పలకాలన్న దానిపై మంత్రి అరుణ్‌జైట్లీ నేతృత్వంలో బీజేపీ, సంఘ్ కీలక నేతలు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు.