ర్యాగింగ్ రక్కసికి విద్యార్థిని బలి
ర్యాగింగ్ రక్కసికి విద్యార్థిని బలి
Published Wed, Jun 25 2014 12:17 AM | Last Updated on Wed, May 29 2019 2:58 PM
ర్యాగింగ్ రక్కసికి చెన్నైలో విద్యార్థిని బలి అయింది. సీనియర్ల పైశాచిక వేధింపులను తట్టుకోలేక అశువులు బాసింది. దీనికి సంబంధించిన సీనియర్ విద్యార్థినిని అరెస్టు చేశారు. డాక్టర్ అవుతుందనుకున్న తమ కుమార్తె శవంగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలు బాదుకుని రోదించారు.
సాక్షి, చెన్నై : విద్యా సంస్థల్లో ర్యాంగింగ్ కట్టడి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా, ర్యాగింగ్ భూతం తాండవం చేస్తూనే ఉన్నది. ఈ ర్యాగింగ్ భూతానికి సోమవారం ఒక విద్యార్థిని బలయింది. ఆత్మహత్య : కాంచీపురం జిల్లా పుల్లయన్ పాళయంకు చెందిన కమలకన్నన్ ఓ ప్రైవేటు కంపెనీలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తన కుమార్తె యోగ లక్ష్మి(19)ని డాక్టరు చేయాలన్న లక్ష్యంతో పోరూర్‌లోని ఓ ప్రైవేటు విద్యా సంస్థలో చేర్పించారు. సెలవులకు ఇంటికి వచ్చినప్పుడల్లా తమ కళాశాలలో, హాస్టల్‌లో ర్యాగింగ్ సాగుతోందంటూ పదే పదే యోగలక్ష్మి చెప్పుకొచ్చేది. తల్లిదండ్రులు ఆమెకు నచ్చ చెప్పి పంపించే వారు.
సోమవారం యోగలక్ష్మి క్లాస్‌కు వెళ్లకుండా హాస్టల్లోని తన గదిలోనే ఉండిపోయింది. సాయంత్రం గదికి వచ్చిన విద్యార్థులు ఫ్యాన్‌కు ఉరేసుకుని వేలాడుతున్న యోగ లక్ష్మిని చూసి కేకలు పెట్టారు. వెంటనే అక్కడి సిబ్బంది కమలకన్నన్‌కు సమాచారం అందించారు. ఎస్‌ఆర్‌ఎంసీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ర్యాగింగ్‌కు బలి: రాత్రి ఆ కళాశాల వద్దకు చేరుకున్న కమలకన్నన్ కుటుంబం తీవ్ర వేదనలో మునిగింది. తమ కుమార్తెను చంపేశారని ఆరోపించారు. ఇక్కడ ర్యాగింగ్ జరుగుతున్నదని పదే పదే తన కుమార్తె చెబుతున్నా, పట్టించుకోలేక పోయామంటూ ఆ కుటుంబం కన్నీటి పర్యంతం అయింది. తమ కుమార్తె నిద్ర మాత్రలు మింగిందని తొలుత సమాచారం ఇచ్చారని, అయితే, ఇక్కడకు వస్తే ఉరివేసుకుని వేలాడుతోందంటూ అనుమానం వ్యక్తం చేశా రు.
దీంతో పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రాయపేట ఆసుపత్రికి తరలించారు. యోగ లక్ష్మి గదిలో పరిశీలించారు. ఆమెకు డైరీ రాయడం అలవాటు ఉండడంతో ర్యాగింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. 16 పేజీల్లో ఆ కళాశాలల్లో సాగుతోన్న ర్యాగింగ్ గురించి యోగలక్ష్మి వివరించింది. తనను పదే పదే ర్యాగింగ్ చేస్తూ వేధిస్తున్న సీనియర్ విద్యార్థిని పేరును అందులో పేర్కొంది. దీంతో ఆ డైరీ ఆధారంగా విచారణ వేగవంతం చేసిన పోలీసులు ఆ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్న తిరుప్పూర్‌కు చెందిన కోటీశ్వరిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ కట్టడి లక్ష్యంగా ఆ కళాశాల యాజమాన్యానికి తీవ్ర హెచ్చరికలు చేసిన పోలీసులు, తమ ఉన్నతాధికారులకు సమాచారాన్ని చేర వేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు.
Advertisement