ఆరోగ్య భారతం!
⇒ పార్లమెంటులో జాతీయ విధానాన్ని ప్రకటించిన కేంద్రం
⇒ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి వైద్య సేవలు
⇒ పబ్లిక్ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు
⇒ యోగాను పాఠశాలలు, పని కేంద్రాల్లో విస్తృతం చేయాలని నిర్ణయం
న్యూఢిల్లీ: ఆరోగ్య భారతాన్ని ఆవిష్కరించే క్రమంలో సమున్నత లక్ష్యాలతో కేంద్ర ప్రభుత్వం జాతీయ వైద్య విధానాన్ని ప్రకటించింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా గురువారం పార్లమెంటులో ఈ విధానంపై ప్రకటన చేశారు. దేశంలో వైద్యసేవలు ప్రతి ఒక్కరికీ తప్పనిసరి చేయాలనే లక్ష్యంతో ఈ విధానానికి కేంద్రం రూపకల్పన చేసింది. పార్లమెంటులో దీనిపై మంత్రి జేపీ నడ్డా ప్రకటన చేస్తూ.. ‘దేశవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యపరీక్షలు నిర్వహించటంతోపాటు అన్ని మందులను అందుబాటులో ఉంచటం ఈ పథకం ఉద్దేశాల్లో ఒకటి.
ఆయుర్దాయాన్ని 67.5 ఏళ్ల నుంచి 70 ఏళ్లకు పెంచాలని, పాఠశాలలు, పని కేంద్రాల్లో మరింత విస్తృతంగా యో గాను ప్రారంభించాలని లక్ష్యాలుగా పెట్టుకున్నాం’ అని స్పష్టం చేశారు. ప్రజారోగ్యంపై వ్యయం ప్రస్తుతం జీడీపీలో 1.5 శాతం ఉండగా.. దీన్ని ఒక నిర్దిష్ట కాలక్రమంలో 2.5 శాతానికి పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జాతీయ వైద్య విధానం–2017ను భారత వైద్య రంగంలో మైలురాయిగా అభివర్ణించించారు. ఇందుకోసం అదనంగా హెల్త్ సెస్సును విధించే ఆలోచనేదీ లేదని ఆయన వెల్లడించారు.
ఈ పాలసీలోని ముఖ్యాంశాలు:
⇔ పేషెంట్లకు సాధికారత కల్పించేలా చికిత్స సరిగా అందని పక్షంలో ఫిర్యాదు చేసేందుకు ట్రిబ్యునళ్ల ఏర్పాటు.
⇔ 2025 కల్లా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల రేటును 23కి, ప్రసూతి మరణాల రేటును 2020 కల్లా 100కు తగ్గించాలి.
⇔ 2019 కల్లా శిశు (ఏడాదిలోపు చిన్నారులు) మరణాల రేటును 28కి, 2025 కల్లా నియోనటల్ (పుట్టిన నెలరోజులోపు చిన్నారులు) మరణాల రేటును 16కు, గర్భస్థ శిశువు మరణాల రేటును సింగిల్ డిజిట్‌కు మార్చాలని లక్ష్యం.
⇔ సంతాన సాఫల్య రేటును 2025కల్లా ప్రస్తుతమున్న 2.5 నుంచి 2.1కు తగ్గించాలి.
⇔ ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పించటం. ఇందుకోసం పాఠశాలు, పని కేంద్రాల్లో యోగాను మరింత విస్తృతం చేయాలని నిర్ణయం.
⇔ 2018 కల్లా కుష్టు వ్యాధి నిర్మూలన.
లోక్‌సభలో వాగ్వాదం
లోక్‌సభలో ఎన్డీయే ప్రభుత్వం పనితీరుపై అధికార, విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంలో ప్రభుత్వం చేపట్టిన కొత్త విద్యుత్ ప్రాజెక్టులేంటో చెప్పాలని లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రశ్నించారు. దీనిపై విద్యుత్ శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పందిస్తూ.. ‘నేను బాధ్యతలు చేపట్టేనాటికి.. గత ప్రభుత్వ నిర్ణయాల కారణంగా దేశంలో విద్యుత్ రంగం పరిస్థితి దారుణంగా ఉంది. చాలా ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నాయి. ఏడుకోట్ల ఇళ్లకు కరెంటు అంటే ఏంటో తెలీదు’ అని తెలిపారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. బీజేపీ ఏం చేసిందో చెప్పాలని ప్రశ్నిస్తూ.. మంత్రి వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసింది. కాగా, పెట్రోల్ పంపుల్లో క్రెడిట్ కార్డు వినియోగంపై సర్‌చార్జ్ వేయటం, ఏటీఎం విత్‌డ్రాయల్‌కూ చార్జీలు వేయటంపైనా విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
కేంద్రీయ విద్యాలయాల్లో 10 వేల ఖాళీల భర్తీ
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో 10 వేల ఖాళీలను ఈ విద్యా సంవత్సరంలోనే భర్తీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ రాజ్యసభలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లోని 31 కేంద్రీయ విద్యాలయాల్లో కలిపి 449 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రకాశం జిల్లాలో మరో రెండు కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, అక్కడ వాటి స్థాపనకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు గుర్తించామన్నారు. కేంద్రంలో ప్రస్తుతం కార్యదర్శి స్థాయిలో మొత్తం 85 మంది ఉద్యోగులుండగా వారిలో నలుగురు మాత్రమే ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందినవారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. అలాగే పెళ్లికాని మహిళా అభ్యర్థులకు ఉద్యోగాల్లో గరిష్ట వయో పరిమితిని 35 ఏళ్లకు పెంచే ప్రతిపాదన లేదని కూడా మంత్రి చెప్పారు.