జమ్మూకు జేజమ్మే వస్తోంది
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా మెహబూబా మఫ్తీ బాధ్యతలు చేపట్టనున్నారు. దాదాపు రెండు నెలలపాటు వివిధ సందర్భాల్లో పలు అంతర్గత సమావేశాలు నిర్వహించి ముఖ్యమంత్రి పదవికి పీడీపీ అభ్యర్థిగా ఆమెను ప్రతిపాదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసినట్లు కీలక వర్గాల ద్వారా తెలిసింది. దీంతోపాటు ఆమెను శాసనసభా పక్ష నేతగా కూడా మఫ్తీని ఎన్నుకున్న నేపథ్యంలో ఇక మఫ్తీ మహ్మద్ సయీద్ స్థానంలో ఆమె ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం దాదాపు ఖరారైపోయింది.
గత జనవరిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సీఎం పీఠం ఖాళీగా ఉంటోంది. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. గురువారం ఇక్కడ జరిగిన కీలక సమావేశంలో సీఎం అభ్యర్థిగా మఫ్తీ పేరును పార్టీ సీనియర్ నేత ముజఫర్ హుస్సేన్ బేగ్ ప్రతిపాదించగా అబ్దుర్ రెహ్మాన్ వీరి అనే మరో నేత బలపరిచారు. అనంతరం ఏకగ్రీవంగా ఆమె అభ్యర్థిత్వానికి ఒప్పుకున్నారు.