శ్రీనగర్: జమ్ముకశ్మీర్ లో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఒక అడుగు ముందుకి, రెండు అడుగులు వెనక్కి పడుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు సంక్షోభం తొలగిపోయినట్లు అనుకున్నప్పటికీ ప్రతిష్టంభన ఇంకా కొనసాగుతోంది. తాజాగా గవర్నర్ ఎన్ ఎన్ వోరాతో జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి అభ్యర్థి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముఫ్తీ ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు గవర్నర్ను కలవాల్సి ఉంది. అయితే ఈ సమావేశం వాయిదా పడటానికి గల కారణాలు తెలియరాలేదు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలతో రాంమాధవ్, జితేందర్ సింగ్ శుక్రవారం ఉదయం భేటీ అయ్యారు. బీజేపీ శాసనసభపక్ష నేతగా నిర్మల్ సింగ్ను ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. పీడీపీతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని బీజేపీ నేతలు తెలిపారు. కాగా గత జనవరిలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి మహ్మద్ సయీద్ అనారోగ్యం కారణంగా అనూహ్యంగా చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచి జమ్మూకశ్మీర్ సీఎం పీఠం ఖాళీగా ఉంటోంది. బీజేపీ, పీడీపీ భాగస్వామ్యంలో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. మెహబూబా ముఫ్తీ నేతృత్వంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతు తెలిపేందుకు ఇప్పటికే బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆ పార్టీ నుంచి మద్దతు లేఖ రావడం లాంఛనమే.
గవర్నర్తో మెహబూబా ముఫ్తీ భేటీ వాయిదా
Published Fri, Mar 25 2016 6:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement