ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష ఖాయమైంది.
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల సూత్రధారి యాకూబ్ మెమన్కు ఉరిశిక్ష ఖాయమైంది. క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రెండోసారి కూడా తిరస్కరించారు. మెమన్కు క్షమాభిక్ష పెట్టేందుకు గతేడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన సంగతి తెలిసిందే. కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరించాల్సిందిగా రాష్ట్రపతికిసూచించారు. మెమన్ను గురువారం ఉదయం 7 గంటల్లోపు ఉరి అమలు చేస్తారు. హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ రాత్రి 10.40 గంటల వరకు రాష్ట్రపతి భవన్ వద్దే ఉండి, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో చర్చించారు.
మెమన్ కు క్షమాభిక్ష పెట్టాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ విజ్ఞప్తి చేశారు. ఉరిశిక్షను వ్యతిరేకించిన అబ్దుల్ కలాంకు నివాళిగా మెమన్ కు క్షమాభిక్ష ప్రసాదించాలని ఆయన కోరారు. దీనికి తోడు తనకు క్షమాభిక్ష పెట్టాలని మరోసారి రాష్ట్రపతిని మెమన్ అభ్యర్థించాడు. దీనిపై పరిశీలించిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం రాత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు.