
మొసలికి చుక్కలు చూపించారు...
బెంగళూరు: ఒకరు, ఇద్దరు ఉన్నప్పుడు మొసలిని చూస్తేనే.. వామ్మో మొసలి అంటూ పరుగుతీయడం సహజం. అదే జనాలు గుంపుగా ప్రాంతాల్లోకి మొసలి వస్తే వాటికి చుక్కలు చూపిస్తారు. అలాంటి ఘటనే కర్ణాటక తూర్పు ప్రాంతంలో ఇటీవలే చోటుచేసుకుంది. కర్ణాటకలోని యాద్గిర్ జిల్లా శివనూర్ గ్రామం సమీపంలో ఓ నీటిమడుగు నుంచి మొసలి బయటకు వచ్చింది. ఆ విషయాన్ని కొందరు గ్రామస్తులు గమనించారు. మనోళ్లు గుంపుగా ఉంటే ఊరకనే ఉంటారా.. ఇక దానిపై రాళ్లతో దాడి చేయడం ప్రారంభించారు. మొసలికి చుట్టూ నిలబడి నవ్వూతూ దాన్ని కన్ ఫ్యూజ్ చేశారు. ఆ తర్వాత రాళ్లు, ఇటుకలు, చేతికి అందిన వస్తువులతో దాని తలపై కొట్టడం మొదలెట్టారు.
కొన్ని నిమిషాల్లోనే అది తీవ్రంగా గాయపడి ఎక్కడికి కదలలేక అక్కడే ఉండిపోయింది. ఆ జనాలకు మరింత ఉషారొచ్చేసింది. తొలుత ఓ వ్యక్తి దాని తోక పట్టుకుని లాగడం చేశాడు. అయితే ఎంతకూ మొసలిని కాస్త కూడా కదల్చలేకపోయాడు. వెంటనే ఇంకో వ్యక్తి తోడవడంతో ఇద్దరూ కలిసి మొసలి తోకను పట్టుకుని కాస్త లాగేసరికి అది కదలింది. వెంటనే ఓసారి కాస్త భయపడ్డారు. ఆ తర్వాత మరోవ్యక్తి మరింత సాహసం చేస్తున్నట్లుగా మొసలిపైకి ఎక్కి దాన్ని తొక్కుతూ ఫొటో దిగాడు. మొసలిపై రాళ్లతో దాడిచేయడం ఈ పూర్తి ఘటనను వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో అక్కడ హల్ చల్ చేస్తోంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు పెరిగి పోతున్నాయి.