మానసిక స్థితి బాగోలేని మహిళపై దాష్టీకం
జైపూర్: రాజస్థాన్‌లో కొందరు ఆకతాయిలు వీరంగం సృష్టించారు. మానవత్వం అనే పదానికి అర్థం మరిచిపోయి తమ ఇష్టరీతిగా ప్రవర్తించారు. మానసిక స్థితి బాగాలేని మహిళని ఆకతాయిలు బావబాదిన ఘటన నాగౌర్‌లో ఆలస్యంగా చూసింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు నాగౌర్ డీఎస్పీ ఓం ప్రకాశ్ గౌతమ్ తెలిపారు. ఆ వివరాలు.. రాజస్థాన్‌లోని నాగౌర్‌లో గత మంగళవారం ప్రకాశ్, శ్రావణ్ సహా మరో యువకుడు బైక్‌పై వెళ్తున్నారు. ఇంతలోనే రోడ్డు పక్కన బైకును నిలిపారు.
మానసిక స్థితి సరిగాలేని మహిళ వద్దకు ముగ్గురు యువకులు వెళ్లారు. ఇందులో ఇద్దరు యువకులు 'జై శ్రీరామ్', 'జై హనుమాన్' అని నినాదాలు చేయాలని సూచించగా.. మహిళ త్వరగా స్పందించలేదు. వెంటనే వీరిలో ఇద్దరు యువకులు పైపులతో ఆ అభాగ్యురాలిని చితకబాదారు. మానవత్వం మరిచిన ఆ యువకులు.. వారు చెప్పిన పదాల్ని గట్టిగా నినదించే వరకు మానసిక స్థితి బాగాలేని మహిళను పైపులతో కొట్టడాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. విషయం వెలుగులోకి రావడంతో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ ఓం ప్రకాశ్ చెప్పారు. జూన్ 13న ఈ ఘటన జరిగిందని, ఈ కేసుకు సంబంధించి నిందితులు ప్రకాశ్, శ్రావణ్ లను అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు డీఎస్పీ వివరించారు.