జనతా పార్టీలు శాశ్వత మిత్రపక్షాలు: లాలూ
కొత్త పార్టీని ఏర్పాటు దిశగా జనతా పరివార్ నేతల కసరత్తు
లక్నో : ఒకప్పటి జనతా పరివార్‌లోని పార్టీలు శాశ్వత మిత్రపక్షాలని ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ అభివర్ణించారు. ఇటీవల ఈ పార్టీలన్నీ మళ్లీ ఒక్కతాటిపైకి వచ్చిన నేపథ్యంలో ఈ వ్యాఖ్య చేశారు. చాలాకాలంపాటు బీజేపీని ఎదుర్కొనడానికి ఇలాంటి ఐక్యకూటమి లేకుండా పోయిందని, ఇప్పుడు మళ్లీ అంతా ఒక్కటయ్యామని ఆదివారం పేర్కొన్నారు. లాలూ కుమార్తె రాజ్యలక్ష్మి, సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయంసింగ్ యాదవ్ మనవడు, పార్లమెంట్ సభ్యుడు తేజ్ ప్రతాప్ యాదవ్ నిశ్చితార్థాన్ని పురస్కరించుకుని ముందుగా ఓ కార్యక్రమాన్ని లక్నోలో నిర్వహించారు. ములాయం కుటుంబంతో రాజకీయ, వివాహ సంబంధాలపై లాలూ మాట్లాడుతూ, యూపీ.. బీహార్‌లు ఇరుగుపొరుగు రాష్ట్రాలని, తమది మనసులతో ముడిపడ్డ బంధమని అన్నారు. తమ కూటమి కార్యాచరణపై నిర్ణయాధికారాన్ని ములాయంకు అప్పగించామని, అధికార పక్షాన్ని ఎదుర్కొనడానికి, మిత్రపక్షాల బలోపేఆనికి తమ రెండు కుటుం బాలు కలసి పనిచేస్తాయని పేర్కొన్నారు.
సంబంధాలు ఇప్పటివికావు : ములాయం
లాలూతో తమ సంబంధాలు కొత్తవి కావని ములాయం అన్నారు. దీర్ఘకాలంగా తమ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్నారు. ఆదివారం లక్నోలో మాట్లాడుతూ జనతా పరివార్ పార్టీలను ఒక్కటిగా చేర్చడానికి తమ రెండు కుటుంబాలు కలసి పనిచేస్తాయని చెప్పారు. దేశంలో కొత్త ప్రత్యామ్నాయ శక్తిని రూపొందించడానికి తమ పార్టీలన్నీ కలసి ఒకే పార్టీగా అవతరించనున్నట్టు తెలిపారు.
బీజేపీ లక్ష్యంగా ఒక్కటవుతున్న ‘జనతా’
విడివిడిగా వెళితే విఫలమతామని తెలుసుకున్న ఒకప్పటి జనతా పార్టీలు మళ్లీ ఒక్కటై అధికార పక్షాన్ని ఎదుర్కొనడానికి సన్నద్ధం అవుతున్నాయి. అందరూ కలసి కొత్త పార్టీగా ఏర్పడి 1970లో చేపట్టిన ప్రయోగాన్ని మరోసారి చేయడానికి కసరత్తు చేస్తున్నారు. అయితే ఈ సారి ప్రత్యర్థి కాంగ్రెస్‌కు బదులు బీజేపీ ఉంది. సమాజ్‌వాది, ఆర్జేడీ, జేడీఎస్, జేడీయూ, ఐఎన్‌ఎల్డీ, సమాజ్‌వాది జనతా పార్టీలు విలీనమై నూతన పార్టీగా ఆవిర్భవించడానికి ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే విలీనప్రక్రియ పూర్తయి, కొత్త పార్టీ ఏర్పడేందుకు మరికొద్ది నెలలు పట్టే అవకాశముందని తెలుస్తోంది.