వారికి.. మెట్రో సౌకర్యాలపై అవగాహన!
బెంగళూరుః దృశ్య, శ్రవణ లోపాలున్న ఓ బృదం మొదటిసారి మెట్రో రైల్లో ప్రయాణించి తమ అనుభవాలను తెలిపింది. ఓ ఎన్జీవో సంస్థతో పాటు ఐటీ సంస్థ సాయంతో వారు 'నమ్మ మెట్రోస్' అండర్ గ్రౌండ్ మెట్రో కారిడార్ లో ప్రయాణించారు. లోపాలున్న వ్యక్తులకు మెట్రోలో కల్పించే ప్రత్యేక సౌకర్యాలపై అవగాహన కల్పించేందుకు సైన్స్ ఇంటర్నేషనల్ ఇండియా ప్రత్యేక రైడ్ నిర్వహించింది.
దృష్టి, వినికిడి లోపాలున్నవారికి మెట్రో రైల్లో ప్రయాణ సౌకర్యాలపై మొదటిసారి ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని చేపట్టారు. లోపాలున్న 34 మంది తోపాటు వారి సహాయకులు సైన్స్ ఇంటర్నేషనల్ నిర్వహించిన ప్రత్యేక రైడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ప్రత్యేక రైడ్ లో కాగ్నిజెంట్ నుంచి 13 మంది వాలంటీర్లు సైతం భాగం పంచుకున్నారు. భారతదేశంలోని దక్షిణ, పశ్చిమ ప్రాంతాలకు చెందిన పలువురు ఈ రైడ్ లో పాల్గొని మెట్రో రైల్లో తమకు ప్రత్యేకంగా కల్పించిన సౌకర్యాలపై అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారు.
బెంగళూరులోని స్వామీ వివేకానంద మెట్రో స్టేషన్ నుంచి కబ్బన్ పార్క్ మెట్రో స్టేషన్ వరకూ వారి ప్రయాణం సాగింది. ఇంద్రియ సంబంధమైన వైకల్యాలతో బాధపడుతున్న వారికి జాతీయ శిక్షణలో భాగంగా ఈ ప్రత్యేక రైడ్ నిర్వహించినట్లు సైన్స్ ఇంటర్నేషనల్ ఓ ప్రకటనలో తెలిపింది. శిక్షణా కార్యక్రమంలో భాగంగా మైట్రో రైళ్ళలో వికలాంగులకు అనుకూలంగా అందించే ప్రత్యేక సౌకర్యాలను వారికి వివరించినట్లు తెలిపారు.