భవిష్యత్తుకు ప్రేరణ ‘మీ కూతురు ఇక నడవలేదు. వినలేదు’ అంటూ వైద్యుడి నోటి నుంచి వచ్చిన మాట విన్న తరువాత ఉజ్వల, ఆమె భర్త తమ జీవితాలను అర్ధంతరంగా చాలించాలనుకున్నారు. నిరాశే తప్ప ఆశ కనిపించని ఆ కఠిన సమయంలో హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదివిన ఉజ్వల ఆత్మస్థైర్యం తెచ్చుకొని, జీవితాన్ని వెలుగుమయం చేసుకుంది. కూతురికి ఉజ్వల భవిష్యత్ ఇచ్చింది...
ఆ రోజులు ఎలాంటివి అంటే... పాప నవ్విన ప్రతిక్షణం ఆ దంపతులకు పండగే. అలాంటి ఆనందమయ రోజుల్లో ఆరు నెలల పాప ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ ప్రమాదం వల్ల పాప పక్షవాతానికి గురైంది. వినికిడి శక్తి కోల్పోయింది. ‘పాప ఇక ఎప్పటికీ నడవలేదు’ అన్నట్లుగా చెప్పాడు డాక్టర్. ఆ ఇల్లు ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ‘ఆత్మహత్య తప్ప మన జీవితానికి మరో పరిష్కారం లేదు’ అనుకున్నారు ఉజ్వల, ఆమె భర్త. ఆ సమయంలో ఒకరోజు తన సోదరి దగ్గర మనసులోని బాధను బయట పెట్టింది ఉజ్వల. సోదరి ఏం మాట్లాకుండా హెలెన్ కెల్లర్ ఆత్మకథ పుస్తకం ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ చేతిలో పెట్టి ‘ఇది ఒకసారి చదువు... ఇంతకుమించి ఏమీ చెప్పను’ అన్నది.
‘ప్రతి నిమిషం నిరాశే’ లాంటి ఆ రోజుల్లో ఒకరోజు ఉజ్వల హెలెన్ కెల్లర్ ఆత్మకథ చదవడం మొదలుపెట్టింది. ఎన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ ‘గుడ్ ఇంగ్లీష్’పై హెలెన్ పట్టుసాధించిన విధానం నుంచి జీవితంలోని నిరాశామయ సమయాల్లోనూ ధైర్యంగా ముందుకు వెళ్లడం వరకు ‘ది స్టోరీ ఆఫ్ మై లైఫ్’ నుంచి ఎన్నో విషయాలు తెలుసుకుంది.
నయాగరా జలపాతం దగ్గర ఉన్నప్పుడు ఆ జలపాతం అందాలను హెలెన్ మనోనేత్రంతోనే చూసిన విధానం అపురూపంగా అనిపించింది. ఆ పుస్తకం చదవడం పూర్తిచేసిన తరువాత తన మనసులో కమ్మిన నిరాశ మేఘాలు దూదిపింజల్లా ఎగిరిపోయాయి.
‘నా బిడ్డ కనీసం చూడగలుగుతుంది కదా’ అనుకుంది ఉజ్వల. తనలో సానుకూల శక్తికి అక్కడే బీజం పడింది. ‘ప్రియాంక’గా ఉన్న పాప పేరును ‘ప్రేరణ’ గా మార్చింది. మార్పు మొదలైంది. అది ఆశావహమైన మార్పు. మరోవైపు... నడవడం కష్టం అనుకున్న పాప వైద్యం, వ్యాయామాల వల్ల నడవడం ప్రారంభించింది. అయితే వినికిడి లోపం మాత్రం పోలేదు. ప్రేరణను స్పీచ్ అండ్ హియరింగ్–ఇంపేర్డ్ స్కూలులో చేర్పించింది. ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఉన్న ఆసక్తిని గమనించి పుణెలోని ‘సాధన నృత్యాలయ’లో చేర్పించింది ఉజ్వల.
‘నృత్యాలయలో చేర్పించిన మాటేగానీ ప్రేరణ ఎలా డ్యాన్స్ చేయగలుగుతుంది? గురూజీ చెప్పే ముద్రలను ఎలా అర్థం చేసుకోగలదు... ఇలాంటి సందేహాలెన్నో నాలో ఉండేవి. అయితే గురూజీ షమిత మహాజన్‌లో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ప్రేరణను ఎలాగైనా మంచి నృత్యకారిణిగా తయారు చేయాలనే పట్టుదల ఆమె కళ్లలో కనిపించింది’ అంటుంది ఉజ్వల. శమిత మహాజన్ దగ్గర నృత్యంలో పాఠాలు నేర్చుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ.
మొదటి రెండు సంవత్సరాలు బాగానే కష్టపడాల్సి వచ్చింది ప్రేరణ. ‘మాటల ద్వారా ప్రేరణకు నాట్యానికి సంబంధించిన ముద్రలను నేర్పించడం కష్టం. చాలా ఓపిక ఉండాలి. గురూజీ ఎప్పుడూ ఓపిక కోల్పోలేదు. గురూజీ చెప్పేదాన్ని లిప్–రీడింగ్ ద్వారా అర్థం చేసుకోవడం మొదలు పెట్టింది ప్రేరణ’ అని గతాన్ని గుర్తు చేసుకుంటుంది ఉజ్వల. ఎంతోమంది సీనియర్ డ్యాన్సర్‌ల ముందు ప్రేరణ ఆరంగేట్రం ఇచ్చింది.
సింగిల్ మిస్టేక్ కూడా చేయలేదు. ‘నాట్యకారిణిగా నీకు ఉజ్వల భవిష్యత్ ఉంది’ అని పెద్దలు ప్రేరణను ఆశీర్పదించారు.‘చీకటిగా ఉన్న నా ఆత్మగదుల్లోకి ఒక కాంతికిరణం ప్రసరిస్తే ఎలా ఉంటుంది?’ అని తన ఆత్మకథ చివరిలో ప్రశ్నిస్తుంది హెలెన్ కెల్లర్. అది అచ్చంగా ఆత్మస్థైర్యంతో తెచ్చుకున్న అపూర్వ విజయంలా ఉంటుంది. అందుకు ఉదాహరణ ప్రేరణ.
ఒక ద్వారం మన కోసం...
బాధ, ఆవేశంలో ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరుచుకొనే ఉంటుంది. ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేము.
– ఉజ్వల సహానే
Comments
Please login to add a commentAdd a comment