
వలస కూలీకి రూ. కోటి
కోజికోడ్: ఒక వలస కార్మికుడి పంట పండింది. కూలీ పని కోసం వలస వచ్చిన మూడో రోజే కోటీశ్వరుడై పోయాడు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాలోని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల మొఫీజుల్ రహానా షేక్ మార్చి 4న కూలీ పనుల నిమిత్తం కేరళకు వచ్చాడు. వచ్చిన వెంటనే ఒక వ్యాపారి వద్ద రూ. 50 వెచ్చించి కారుణ్య లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు.
కాగా తర్వాత రోజు తీసిన డ్రాలో రహానా రూ. కోటి గెలుపొందినట్లు తెలుసుకుని ఒకవైపు ఆనందంలో మునిగి తేలుతుంటే మరోవైపు లాటరీ టికెట్ కోసం సహచర కార్మికులు దాడి చేస్తారని భయంతో తనకు భద్రత కల్పించాలని పోలీసులను ఆశ్రయించాడు. అయితే పోలీసులు అతనిని బ్యాంకుకు తీసుకెళ్లి ఖాతా తెరిపించి టికెట్‌ను అక్కడ భద్రపరిచారు.