తమకు ఊహ తెలియనప్పుడే గల్ఫ్ కు వెళ్లి అక్కడే చనిపోయిన తండ్రి జ్ఞాపకాలు ఆ పిల్లలకు లేవు. ఇతడే మీ నాన్న... అని పోస్టర్ లోని ఫోటోను తన కూతురుకు వేలుతో చూపిస్తున్న తల్లి. వెనుక నుండి గమనిస్తున్న కుమారుడు.(ఫైల్ ఫోటో)
చనిపోయిన వారిని స్మరించండి - బ్రతికున్న వారి కోసం పోరాడండి (రిమెంబర్ ది డెడ్ - ఫైట్ ఫర్ ది లివింగ్) అనే నినాదంతో గత కొన్నేళ్లుగా తెలంగాణ గల్ఫ్ ప్రవాసి కార్మిక సంఘాలు ప్రతి ఏటా ఏప్రిల్ 28న 'గల్ఫ్ అమరుల దినోత్సవం' (గల్ఫ్ మార్టియర్స్ డే) నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో చనిపోయిన, గాయపడిన, వికలాంగులైన, అనారోగ్యానికి గురైన కార్మికుల స్మారకార్థం... ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 28 న 'అంతర్జాతీయ కార్మికుల స్మారక దినోత్సవం' (ఇంటర్నేషనల్ వర్కర్స్ మెమోరియల్ డే) జరుపుకుంటారు. ఈ స్మారక దినోత్సవం సందర్భంగా గల్ఫ్ వలస కార్మికుల వెతలను బయటకి తేవడంతో పాటు వారికి చట్టపరమైన సహాయం అందేలా అనేక సంస్థలు రెండు రాష్ట్రాల్లో కృషి చేస్తున్నాయి.
పదేళ్ల క్రితం... జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం పాతగూడూరు కు చెందిన దుర్గం భీమయ్య అనే వలస కార్మికుడు ఓమాన్ దేశంలోని మస్కట్ లో నివసించేవాడు. ఓమాన్‌లో అక్రమ నివాసి (ఖల్లివెల్లి)గా ఉండటంతో ప్రతి దినం జరిమానాలు, జైలు శిక్షల భయంతో జీవించేవాడు. దీంతో ఏ భయాలు లేకుండా బతికేందుకు తిరిగి ఇండియా రావాలనుకున్నాడు. ఈ క్రమంలో ఇండియాకు చేరుకోవడానికి పక్క దేశమైన యూఏఈ (దుబాయి) ద్వారా వెళ్లిపోవడం సులభ మార్గమని ఎవరో చెప్పిన మాటను నమ్మాడు. అదే క్రమంలో కాలి నడకన మరికొందరితో కలిసి ఓమాన్ నుండి యుఏఈకి ఎడారిలో సరిహద్దు వెంబడి నడక ప్రారంభించారు. ఇంతలో 2 మే 2012 న ఓమాన్ సైన్యం జరిపిన కాల్పుల్లో మరణించాడు. అతి కష్టం మీద శవపేటిక ఇండియాకు వచ్చింది.
1976 నుంచి
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1976 నుంచి గల్ఫ్ దేశాలకు వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. కానీ ఎంత మంది వెళ్లారు? ఎక్కడ పని చేస్తున్నారు ? ఎవరెలా ఉన్నారనే గణాంకాలు పట్టించుకున్న వారు లేరు. స్వతంత్ర భారత దేశంలోనూ ఇంచుమించు ఇదే ధోరణి కొనసాగింది. కానీ 90వ దశకం తర్వాత తీసిన లెక్కల్లో దుర్గం భీమయ్య కంటే ముందే గల్ఫ్ దేశాల్లో అసువులు బాసిన వలస కార్మికుల సంఖ్య 1500లకు పై మాటగానే ఉంది. ఈ తరుణంలో భీమయ్య బాధకర మరణంతో ఒక్కసారిగా గల్ఫ్ వలస కార్మికుల కష్టాలు, వార కుటుంబాలు పడుతున్న బాధలు తెర మీదకు వచ్చాయి. దీంతో వలస కార్మికుల హక్కులు, రక్షణ కోసం పని చేయడంలో అనేక సంస్థలు శ్రద్ధ కనబరుస్తూ వస్తున్నాయి.
సాయం అందిన తర్వాత
మృతుడు దుర్గం భీమయ్య భార్య స్వప్న తన కుమారుడు శ్రవణ్, కూతురు శ్వేత వైష్ణవి లను కష్టపడి పెంచింది. ఎస్సీ కార్పొరేషన్ సహాయంతో బ్యాంక్ లోన్ తో బర్రెలను కొని పాల ఉత్పత్తి చేపట్టింది. సకాలంలో అప్పు తీర్చేసి బ్యాంకు అధికారుల మన్ననలను పొందింది. కొందరు దాతల చిరు సహాయం పిల్లల చదువుకు ఉపయోగపడింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీగా పని చేస్తున్నది. రోజువారీ వ్యవసాయ కూలీ, భవన నిర్మాణ కూలీగా కూడా పనిచేస్తున్నది. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్ లో 10వ తరగతి పాస్ అయిన కూతురు శ్వేత వైష్ణవికి బాల్య వివాహం చేసింది. కూతురుకు కూతురు పుట్టింది. పెళ్లి అయి కూతురు పుట్టినప్పటికీ శ్వేత వైష్ణవి ఇంటర్ ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నది. కుమారుడు శ్రవణ్ ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి, ఇప్పుడు బీకాం ఫస్టియర్ చదువుతున్నాడు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం కోసం కోచింగ్ కు వెళ్లాలని ప్రయత్నిస్తున్నాడు.
కాలగర్భంలో
బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఎందరో అమరులయ్యారు. కొందరి జీవితాల్లు కష్టాలు బయటకి రాగా మరెందరో కాలగర్భంలో కలిసిపోయారు. కానీ భీమయ్య ఘటన తర్వాత గల్ఫ్ కార్మికుల జీవితాలు, వాటి కుటుంబ సభ్యుల బాధలపై పట్టింపు పెరిగింది. ఈ క్రమంలో అనుకోని పరిస్థితుల్లో భీమయ్య చనిపోయినా.. అతనికి కుటుంబానికి దక్కిన చిరు సాయం (ఎస్సీ కార్పోరేషన్ రుణం)తో ఆ కుటుంబం తిరిగి నిలదొక్కుకోగలిగింది. కానీ ఇప్పటికీ ఎన్నో కుటుంబాలు ఇటు ప్రభుత్వాల నుంచి అటు సమాజం నుంచి ఎటువంటి సాయం అందక చితికి పోతున్నాయి.
చేయూతనివ్వండి
ఈ నేపథ్యంలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు బతుకుదెరువు వేటలో అమరులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ సాయం కోసం రెండు రాష్ట్రాల్లో సుమారు ఆరు వేల మంది గల్ఫ్ దేశాల్లో అమరులయ్యారు. వారి కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.
- మంద భీంరెడ్డి (గల్ఫ్ వ్యవహారాల విశ్లేషకులు)
+91 98494 22622
చదవండి: What Is ECR And ECNR: ఈసీఆర్, ఈసీఎన్నార్ పాస్‌పోర్టులు ఎందుకో తెలుసా ?
Comments
Please login to add a commentAdd a comment