
సాక్షి, లక్నో : దేశవ్యాప్తంగా జరిగిన నాలుగు లోక్‌సభ, 11 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి యూపీ మంత్రి ఆసక్తికర వివరణ ఇచ్చారు. వేసవి సెలవల కారణంగా తమ మద్దతుదారులు, ఓటర్లు వారి పిల్లలతో కలిసి ఊర్లకు వెళ్లడంతో తాము రెండు స్ధానాల్లో (కైరానా, నూర్పూర్) ఓటమి పాలయ్యామని యూపీ మంత్రి లక్ష్మీనారాయణ్ చౌధురి అన్నారు.
ఉప ఎన్నికలకు, సాధారణ ఎన్నికలకు భారీ వ్యత్యాసం ఉంటుందని వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ఓటర్లు ఓటు హక్కును ఉపయోగించుకుంటారన్నారు. ఉప ఎన్నికల్లో విపక్షాలు ఐక్యంగా ముందుకెళ్లడంతో పలు రాష్ట్రాల్లో బీజేపీకి చుక్కెదురైంది. ఉప ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్ధానాల్లో రెండు స్ధానాలను కోల్పోయిన బీజేపీ 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగ్గా కేవలం ఒక స్ధానంలో గెలుపొందింది.
కాగా పది అడుగులు ముందుకెళ్లాలంటే రెండు అడుగులు వెనక్కితగ్గాలని, రాబోయే రోజుల్లో తాము భారీ విజయం సాధిస్తామని ఉప ఎన్నికల ఓటమిపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే ఊపుతో రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలని విపక్షాలు యోచిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment