
గోరక్షక మంత్రిత్వ శాఖ, హ్యాపీనెస్ శాఖ .. ఇవీ ఈ మధ్యకాలంలో కొత్తగా ఏర్పాటైన మంత్రిత్వ శాఖలు. వాటిని తొలిసారి నిర్వహించిన మంత్రులిద్దరూ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. రాజస్తాన్‌లో వసుంధరా రాజె కేబినెట్లో గోరక్షక మంత్రిత్వ శాఖ మంత్రిగా పనిచేసిన ఒటారమ్ దేవాసి 10 వేల ఓట్ల తేడాతో స్వతంత్ర అభ్యర్థి చేతిలో కంగుతిన్నారు. ఇక మధ్యప్రదేశ్ హ్యాపీనెస్ శాఖ మంత్రి లాల్‌సింగ్ ఆర్య కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో 25 వేల ఓట్ల తేడాతో పరాజయం చవిచూశారు. గోసంక్షరణ ఉద్దేశం మంచిదే అయినా ఆ సాకుతో మూకదాడులకు పాల్పడటమే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడటానికి కారణమైందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 2015లో గోరక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేవాసి రాజస్తాన్‌లో కొత్తగా ఆస్తులు కొనుక్కునే వారిపై గో పన్ను అంటూ 20 శాతం సర్‌చార్జ్ విధించారు. గోవుల్ని రక్షించడానికి 2,300 షెల్టర్లు ఏర్పాటు చేశారు.
అయితే 2016లో ప్రభుత్వ గోశాలల్లో 500గోవులు ఆకలికి తాళలేక మరణించడంతో దేవాసిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత కొన్నాళ్లకే విష ప్రయోగంతో మరిన్ని ఆవులు చనిపోయాయన్న వార్తలతో దేవాసి ప్రతిష్ట పూర్తిగా మంట గలిసింది. ఇక, దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ప్రజలు సంతోష స్థాయిలు పెంచడమే లక్ష్యంగా మధ్యప్రదేశ్‌లో హ్యాపినెస్ మంత్రిత్వ శాఖను సీఎం శివరాజ్‌సింగ్ కొత్తగా సృష్టించి లాల్‌సింగ్ ఆర్యను మంత్రిగా నియమించారు. ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసుకోవడం కోసం ఆర్య భూటాన్ తరహాలో సంతోష సూచీ తయారీకి మార్గదర్శకాలు రూపొందించారు. 2009లో జరిగిన తన ప్రత్యర్థి హత్యానేరం కేసు మెడకు చుట్టుకోవడంతో ఆర్య జీవితంలో సంతోషం లేకుండా పోయింది.
Comments
Please login to add a commentAdd a comment