
అత్యాచారాల అడ్డాగా...
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అత్యాచారాల అడ్డాగా మారుతోంది. నేర చరిత్రకు తార్కాణంగా నిలుస్తోంది. బులంద్ షహర్ అత్యాచార ఘటన మరువక ముందే మరో దారుణం చోటు చేసుకుంది. పట్టపగలే ఓ మైనర్ బాలికపై 12 మంది సామూహిక అత్యాచారం జరిపి హత్య చేయడం దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్ నగ్లాసంత్ గ్రామంలో 14 ఏళ్ళ మైనర్ బాలికపై 12 మంది అత్యాచారానికి ఒడిగట్టడమే కాక, ఆమెను హత్య చేయడం ఆందోళన రేపుతోంది. ఆగస్టు 20న బాలిక పొలానికి వెళ్ళిన సమయంలో ఏకంగా 12 మంది.. పట్టపగలే ఆమెను దారుణంగా చంపి, అనంతరం అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. సురేంద్ర అనే వ్యక్తితోపాటు మరో 11 మందికి వ్యతిరేకంగా బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ ఆఫీసర్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. కేసులో ఇప్పటివరకూ ఎవరినీ అరెస్టు చేయలేదని, దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.