'ఒబామాను ఆహ్వానించే ఛాన్స్ మిస్సయ్యాం'
లక్నో:అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాను ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్సును కోల్పోయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ పశ్చాతాపం వ్యక్తం చేశారు. గణతంత్ర వేడుకల్లో భాగంగా మూడు రోజుల పర్యటనకు ఒబామా ఆదివారం భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఒబామా ముందస్తు షెడ్యూల్ ప్రకారం మంగళవారం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శించాల్సి ఉంది. అయితే గత గురువారం సౌదీ అరేబియా రాజు అబ్దుల్లా కన్నుమూయడంతో ఒబామా ఆగ్రా పర్యటన రద్దయ్యింది.
ఒబామా రాష్ట్ర పర్యటన రద్దుకావడంతో అఖిలేష్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. 'ఒబామాను రాష్ట్రానికి ఆహ్వానించే ఛాన్స్ కోల్పోయాం. ఇది నిజంగా చాలా బాధాకరం'అంటూ తన అధికారిక ఫేస్ బుక్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం ఒబామా విందుకు పలువురు ప్రముఖులకు ఆహ్వానం అందింది. ఈ విందుకు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. రెండు ప్రధాన ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి ఆహ్వానించదగ్గ పరిణామం అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.