ఆడీ కారు.. డాక్టరుగారు.. దొరికారు
లక్నో: బీహార్లో తన ఆడి కారుతో పాటు కనిపించకుండపోయిన డాక్టర్ గుప్తా దంపతుల ఆచూకీ దొరికింది. ఉత్తరప్రదేశ్ టాస్క్ ఫోర్స్, బీహార్ పోలీసుల సంయుక్త ఆపరేషన్లో కిడ్నాపర్ల గుట్టు రట్టయింది. మే 1వ తేదీ నుంచి మాయమైన డాక్టర్ పంకజ్ గుప్తా, శుభ్ర గుప్తా దంపతులను రక్షించామని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో సంబంధమున్న 9 మంది కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసు అధికారి అమిత్ పాథక్ తెలిపారు.
పోలీసుల సమాచారం ప్రకారం గయకు వెళుతున్న ఈ దంపతులను.. పోలీసు దుస్తుల్లో వచ్చిన కొంతమంది దుండగులు ఎర్ర బుగ్గలున్న రెండు ఎస్యూవీ వాహనాలతో అటకాయించి ఎత్తుకుపోయారు. ఎవరికీ అనునమానం రాకుండా వాహనాలు మార్చుకుంటూ చాలా ప్రదేశాలు తిప్పారు. చివరికి లక్నో గోమతి నగర్ ఏరియాలోని శారదా అపార్ట్మెంట్లోని ఫ్లాట్లో దాచి ఉంచారు. ఎలాగోలా.. డాక్టర్ గుప్తా దంపతులు తమ ఆచూకీని ఫోన్ ద్వారా బంధువులకు సమాచారం అందించారు. వారు నాలుగు ఖరీదైన వాహనాలను ఉపయోగించినట్టు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా గుర్తించామని అమిత్ పాథక్ తెలిపారు. సంఘటనా స్థలంలో నాటు తుపాకులు, కొన్ని లైవ్ తూటాలు దొరికాయని, డాక్టర్ గుప్తాకు చెందిన ఆడి కారుతో పాటు, నిందితులు వాడిన రెండు ఎస్ యూవీలను కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు.
కాగా బడా పారిశ్రామిక వేత్తల కుటుంబానికి చెందిన డాక్టర్ దంపతులు మాయం కావడం పోలీసు వర్గాల్లో కలవరం రేపింది. వీరు ప్రయాణించిన మార్గంలో మావోయిస్టులు, దొంగల బెడద, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడి ఉంటారేమోనన్న అనుమానంతో ప్రత్యేక బృందాలతో కలసి గాలింపు చర్యలు చేపట్టారు.