మోదీ సర్కారుకు హైకోర్టు శరాఘాతం
► ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన రద్దు
► రావత్ సర్కారును పునరుద్ధరిస్తూ హైకోర్టు తీర్పు
► 29న మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశం
► కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ధర్మాసనం
► ప్రజాస్వామ్య వ్యవస్థ మొత్తం ప్రమాదంలో ఉంది
► ‘356’ విధింపు సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధం
► ‘రాష్ట్రపతి పాలన’కు చూపిన ప్రాతిపదిక బలంగా లేదు
► తీర్పు వెలువరించే వరకూ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను తొలగించబోమని కేంద్రం హామీ ఇవ్వాలన్న ధర్మాసనం
► ఇవ్వలేమన్న కేంద్ర న్యాయవాది.. మండిపడ్డ హైకోర్టు
► తీర్పుపై స్టేకూ నిరాకరణ.. నేడు సుప్రీంలో కేంద్రం సవాల్
నైనిటాల్
కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వానికి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్‌లో కేంద్రం విధించిన రాష్ట్రపతి పాలనను ఆ రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. హరీశ్ రావత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించింది. ఈ నెల 29వ తేదీన శాసనసభలో మెజారిటీని నిరూపించుకోవాలని ఆ సర్కారును ఆదేశించింది. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ పరిణామంతో.. సోమవారం నుంచి మొదలుకానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల రెండో విడతలో గందరగోళం చెలరేగే సూచనలు ప్రస్ఫుటమయ్యాయి. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించటంపై మోదీ సర్కారు తీరును ఖండించాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసు ఇచ్చింది.
ఉత్తరాఖండ్‌లో రాజ్యాంగంలోని 356వ అధికరణ కింద రాష్ట్రపతి పాలన విధిస్తున్నట్లు కేంద్రం గత నెల (మార్చి) 27వ తేదీన ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది సుప్రీంకోర్టు ఆదేశించిన చట్టానికి విరుద్ధమంటూ ఉత్తరాఖండ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ కె.ఎం.జోసెఫ్, జస్టిస్ వి.కె.బిస్త్‌లతో కూడిన ధర్మాసనం గురువారం నాడు కొట్టివేసింది. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దు చేయటంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది. అదేసమయంలో.. తిరుగుబాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 9 మందిపై అనర్హత వేటును కూడా హైకోర్టు ధర్మాసనం సమర్థించటం విశేషం. పార్టీ ఫిరాయింపు అనే రాజ్యాంగ పాపానికి ఒడిగట్టినందుకు.. స్పీకర్ అనర్హత వేటు ద్వారా వారు మూల్యం చెల్లించాల్సి ఉంటుందంటూ వ్యాఖ్యానించింది.
వారం పాటు తొలగించబోమని హామీ ఇస్తారా?
ధర్మాసనం గురువారం బహిరంగ కోర్టులో దాదాపు రెండున్నర గంటల పాటు తీర్పును మౌఖికంగా ప్రకటించింది. ఈ తీర్పు ప్రకటన వరకూ.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను వారం రోజుల పాటు తొలగించబోమని, వేరొకరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించబోమని హామీ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిని ధర్మాసనం కోరింది. అటువంటి హామీ ఇచ్చే అవకాశం తనకు లేదని న్యాయవాది పేర్కొనగా ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ‘‘తీర్పు ఇవ్వకముందే రాష్ట్రపతి పాలన తొలగించి, మరొకరికి ప్రమాణం చేసే అవకాశం ఇస్తే.. న్యాయాన్ని వక్రీకరించటం కాదా? మీరు ప్రతి రాష్ట్రంలోనూ ఇలా చేయగలరు. పది, పదిహేను రోజులు రాష్ట్రపతి పాలన విధించి.. మరొకరిని ప్రమాణ స్వీకారం చేయమనటం’’ అని విమర్శించింది. ‘‘మీరు ఇలా ప్రవర్తించటం పట్ల మాకు కోపం కన్నా ఎక్కువగా బాధ కలుగుతోంది.
అత్యున్నత అధికారం - భారత ప్రభుత్వం - ఇలా ప్రవర్తిస్తోంది. కోర్టుతో ఆటలాడవచ్చని మీరు ఎలా భావిస్తారు?’’ అని మండిపడింది. అనంతరం మౌఖికంగా తీర్పును ప్రకటిస్తూ.. ప్రస్తుత కేసు మార్చి 18వ తేదీ నుంచి మొదలైందని.. ఆ రోజును తొలి రోజుగా లెక్కిస్తే 356వ అధికరణ ప్రకటనను పది రోజుల లోగానే చేశారని.. ఇది సుప్రీంకోర్టు విధించిన చట్టానికి విరుద్ధమని స్పష్టంచేసింది. రాష్ట్రపతి పాలన విధించటానికి పరిగణనలోకి తీసుకున్న అంశాలు బలంగా లేవని.. కాబట్టి రాష్ట్రపతి పాలన ప్రకటనను న్యాయసమీక్ష చేయటం సరైనదేనని పేర్కొంది. రాష్ట్రపతి పాలన ప్రకటించిన రోజు నాటి పరిస్థితి యథాతథంగా కొనసాగుతుందని.. అంటే పిటిషనర్ (హరీశ్‌రావత్) సారథ్యంలోని ప్రభుత్వం పునరుద్ధరణ అవుతుందని తీర్పు చెప్పింది.
కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా..?
‘‘రాష్ట్ర ప్రభుత్వాలను వదిలించుకోవటం, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని రద్దుచేయటం లేదా తొలగించటం, గందరగోళం ప్రవేశపెట్టం, తద్వారా.. ఎండ, వాన, మంచులను తట్టుకుంటూ ఓటు వేయటానికి తెల్ల కాగితంతో నిలుచునే సామాన్యుడి విశ్వాసాన్ని దెబ్బతీయటం.. కేంద్ర ప్రభుత్వ ఇష్టానుసారమా అన్నది ఈ అంశంలో అతి కీలకం. సస్పెన్షన్ అయినా, రద్దు చేయటమైనా.. దాని ప్రభావం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలదోయటమేనన్నది మా అభిప్రాయం. అది ప్రజాస్వామ్య ప్రక్రియలో పాలు పంచుకునే పౌరుల మనసుల్లో నిస్పృహకు అంకురార్పణ చేస్తుంది. ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్య పునాదిని బలహీనపరుస్తుంది. ఇక్కడ మొత్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. భారతదేశం రాష్ట్రాల సమాఖ్య. కేంద్రం, రాష్ట్రాలు తమ తమ పరిధుల్లో సార్వభభౌమత్వం కలిగి ఉన్నాయి. కాబట్టి ఈ అంశాన్ని విస్తృత పరిధిలో చూడాలి. 356 అధికరణను చివరి అవకాశంగా, అత్యంత జాగరూకతతో ఉపయోగించాలన్నది స్పష్టం’’ అని తన సుదీర్ఘ తీర్పులో పేర్కొంది.
సుప్రీంకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోండి...
ఈ తీర్పుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అప్పీలు చేసేందుకు వీలుగా.. తీర్పును నిలుపదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ న్యాయవాది విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది. ‘‘ఇప్పుడు రాష్ట్రపతి పాలన లేదు. ప్రభుత్వ పునరుద్ధరణ జరిగింది. (తీర్పు రాసేందుకు) మాకు సమయం ఇవ్వాలని మేం మీకు చెప్పాం. కానీ.. ఇప్పుడే ప్రకటించేలా మీరు మమ్మల్ని బలవంతం చేశారు. మీరు సుప్రీంకోర్టుకు వెళ్లి (ఈ తీర్పును) నిలుపదల చేయించుకోండి’’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో రాష్ట్రపతి నిర్ణయంపై న్యాయ సమీక్షకు గల అవకాశంపై కేంద్రం వాదనలను తోసిపుచ్చుతూ.. ‘‘న్యాయబద్ధమైన ప్రయోజనం కోసం అన్నట్లుగా కనిపించినప్పటికీ.. అనుషంగిక ప్రయోజనం పొందటం అంగీకారయోగ్యం కాదు’’ అని పేర్కొంది.
వినియోగ బిల్లు వివాదంతో మొదలై...
ఉత్తరాఖండ్ శాసనసభలో మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు ఆమోదంపై వివాదం చెలరేగటం.. ఆ ద్రవ్య బిల్లు ఓడిపోయిందని, ప్రభుత్వం మెజారిటీ కోల్పోయిందని బీజేపీ, కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు వాదించటంతో.. అదే నెల 28వ తేదీన ప్రభుత్వం శాసనసభలో మెజారిటీ నిరూపించుకోవాలని హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం ఆదేశించింది. విశ్వాసపరీక్ష జరగాల్సిన ఒక రోజు ముందు మార్చి 27వ తేదీన.. రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందన్న ప్రాతిపదికగా చూపుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించింది. రాష్ట్రపతి పాలన విధింపును సవాల్ చేస్తూ హరీశ్‌రావత్ హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
దీనిపై గత మూడు రోజుల విచారణలో హైకోర్టు.. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించటానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. విశ్వాస పరీక్షకు కేవలం ఒక్క రోజు ముందు 356 అధికరణ కింద రాష్ట్రపతి పాలనను ప్రకటించటం.. ప్రజాస్వామ్య మూలాలను నరికివేయటమేనని సోమవారం నాడు అభివర్ణించింది. ఆ తర్వాతి రోజు.. ఒక ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కనపెట్టి కేంద్రం గందరోళాన్ని ప్రవేశపెడుతోందని విమర్శించింది. బుధవారం నాడు.. రాష్ట్రపతి కూడా తీవ్ర పొరపాటు చేయవచ్చునంటూ.. రాష్ట్రపతి పాలనపై న్యాయసమీక్ష చేయవచ్చునని పేర్కొంది.
నేడు ‘సుప్రీం’లో సవాల్ చేయనున్న కేంద్రం
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నాడు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు అటార్నీ జనరల్ ముకుల్ రోహ్తగి గురువారం సాయంత్రం ఢిల్లీలో మీడియాకు తెలిపారు. హైకోర్టు తీర్పును నిలిపివేయాలని కోరుతూ శుక్రవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి టి.ఎస్.ఠాకూర్ ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తానని ఆయన చెప్పారు. మార్చి 18వ తేదీన వినియోగ బిల్లు శాసనసభలో వాస్తవానికి ఆమోదం పొందలేదని.. స్పీకర్ స్వయంగా దీనిని నిర్ధారించారని, అంటే ప్రభుత్వం పడిపోయినట్లేనని ఆయన పేర్కొన్నారు.
మోదీజీ కలిసి పనిచేద్దాం
‘మాకన్నా బలమైన కేంద్రంతో విరోధం పెట్టుకోవాలని మేం అనుకోవటం లేదు. పరస్పర సహకారంతో సమాఖ్య పద్థతిలో కలిసి పనిచేసుకుందాం. ఇటీవల జరిగిన పరిణామాలను ప్రధాని మరిచిపోయి.. రాష్ట్రాభివృద్ధికి సహకరించాలి’
- హరీశ్ రావత్, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి
మోదీ, షా క్షమాపణలు చెప్పాలి: కాంగ్రెస్
‘రాజ్యాంగాన్ని హత్యచేసి, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కేందుకు ప్రయత్నించిన ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా దేశానికి క్షమాపణలు చెప్పాలి. హైకోర్టు తీర్పు బీజేపీకి చెంపపెట్టు వంటిది. ఇది కాంగ్రెస్ విజయం మాత్రమే కాదు. ప్రజాస్వామ్య విజయం. విశ్వాస పరీక్షలోనూ మాదే విజయం’
ఈ తీర్పు ఊహించిందే: బీజేపీ
‘ఈ నిర్ణయంపై మాకేం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. మూడురోజులుగా జరుగుతున్న పరిణామాలతో దీన్ని ముందుగానే ఊహించాం. కాంగ్రెస్ ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం దురదృష్టకరం. ఇప్పటికీ ఉత్తరాఖండ్ ప్రభుత్వం మైనారిటీలోనే ఉంది. ఏప్రిల్ 29నే వారి భవితవ్యం తేలుతుంది’
బీజేపీకి చెంపదెబ్బ
‘ఉత్తరాఖండ్ పరిణామాలు బీజేపీ ప్రభుత్వానికి చెంపదెబ్బలాంటివి. రాజ్యాంగ వ్యతిరేకమైన పనులు చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవనేదానికి ఇదో మంచి ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగం బట్టబయలైంది’ - సీతారాం ఏచూరీ, సీపీఎం ప్రధాన కార్యదర్శి
ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి
‘మోదీ ప్రభుత్వానికి ఇదో ఎదురుదెబ్బ. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల విషయంలో మోదీ జోక్యం తగ్గించుకుని ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి’ - అరవింద్ కేజ్రీవాల్, ట్విట్టర్లో
ప్రజాస్వామ్య విజయమిది
‘బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకుందామనుకున్న బీజేపీ ఆశలు అడియాసలయ్యాయి. ఇది ప్రజాస్వామ్య విజయం. మోదీజీ రాజ్యాంగం దాడి చేద్దామని మీరు చేస్తున్న ప్రయత్నానని ఉత్తరాఖండ్ ప్రజలు, యావద్భారతం గమనిస్తోంది’ - రాహుల్ గాంధీ, ట్వీట్టర్లో