‘మేక్ ఫర్ ఇండియా’ కావాలి | Modi government policies failure says seetharam echuri | Sakshi
Sakshi News home page

‘మేక్ ఫర్ ఇండియా’ కావాలి

Published Tue, May 5 2015 2:09 AM | Last Updated on Tue, Aug 21 2018 9:38 PM

‘మేక్ ఫర్ ఇండియా’ కావాలి - Sakshi

‘మేక్ ఫర్ ఇండియా’ కావాలి

మోదీ సర్కారు విధానాలు ఫలించవు: సీతారాం ఏచూరి
విదేశీ, కార్పొరేట్ పెట్టుబడులతో ఫలితం ఉండదు
దేశంలో ఉత్పాదక సామర్థ్యాలు పెరిగితేనే ఉపయోగం
పీటీఐ ఇంటర్వ్యూలో సీపీఎం ప్రధాన కార్యదర్శి


న్యూఢిల్లీ: అధిక పెట్టుబడులతో అధిక ఆర్థికాభివృద్ధి సాధించవచ్చన్న మోదీ ప్రభుత్వం వాదన పనిచేయదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించటం కోసం, దేశీయ పెట్టుబడుల కోసం కార్పొరేట్ సంస్థలకు భారీ రాయితీలు ఇవ్వటం వంటి మోదీ ప్రభుత్వ విధానాలు ఫలించబోవని.. కారణం భారీ పెట్టుబడులు దేశంలో ఉత్పాదక సామర్థ్యాన్ని సృష్టించబోవని, పైగా ప్రజల వద్ద కొనుగోలు శక్తి లేదని పేర్కొన్నారు.


ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టటం ద్వారా ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలని.. తద్వారానే ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని  అన్నారు. ఇటీవలే సీపీఎం ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన ఏచూరి సోమవారం పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదాన్ని  విమర్శించారు. ప్రభుత్వ నినాదం ‘మేక్ ఫర్ ఇండియా’గా.. అంటే ఇండియా కోసం, ఇండియా చేత తయారీగా ఉండాల్సిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ రేకెత్తించిన ప్రజా ఆకాంక్షలను నెరవేర్చటంలో ఆ పార్టీ ప్రభుత్వం విఫలమైందని.. ఈ ప్రభుత్వ విధానాలు ప్రతిపక్ష పార్టీలు ఏకం కావటానికి అవకాశం కల్పించాయన్నారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు ఏచూరి మాటల్లోనే...

ప్రభుత్వ పెట్టుబడులు కావాలి...
‘మోదీ విధానాలు పనిచేయవు. మరిన్ని విదేశీ పెట్టుబడుల కోసం రాయితీలు ఇస్తున్నారు. భారతీయ కార్పొరేట్ సంస్థలు మరింత ఎక్కువగా పెట్టుబడులు పెట్టేందుకు వారికీ రాయితీలు ఇస్తున్నారు.  అధిక పెట్టుబడుల ద్వారా కొత్త ఉద్యోగ అవకాశాల సృష్టి జరుగుతుందని, తద్వారా అధిక ఆర్థికాభివృద్ధి జరుగుతుందని మోదీ ప్రభుత్వం చెప్తోంది.  పెట్టుబడులు ఉత్పాదక రంగంలోకి వచ్చినపుడే అర్థవంతంగా ఉంటుంది.  వారు వస్తువులను ఉత్పత్తి చేస్తే అవి అమ్ముడుపోవాల్సి ఉంటుంది.


కానీ వాటిని ఎక్కడ అమ్ముతారు? ఇప్పుడు ప్రపంచ మాంద్యం నెలకొని ఉంది. విదేశాల్లో అమ్మలేరు. దేశంలో ప్రజల కొనుగోలు శక్తి పడిపోతోంది. భారత్‌లోనూ అమ్మలేరు. మన సొంత ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయనిదే.. అధిక పెట్టుబడులు అధిక వృద్ధిని సృష్టించవు. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయటమనేది.. ప్రభుత్వ రంగంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టటం వల్ల మాత్రమే జరుగుతుంది. కానీ.. దీనిని సుదీర్ఘ కాలంగా ఆపివేశారు.


కార్పొరేట్లకు పన్ను రాయితీలు వద్దు...
విదేశీ పెట్టుబడులు, కార్పొరేట్ సంస్థలకు భారీ పన్ను రాయతీలు ఇవ్వటం సరికాదు. న్యాయమైన పన్నులు వసూలు చేయాలంటున్నాం.  ఆర్థిక బిల్లులో నిర్ణయించిన మేరకే పన్నులు వసూలు చేయాలి. అవి రూ. 5 లక్షల కోట్లు ఉంటాయి. మౌలిక సదుపాయాల కల్పనకు వెచ్చించాలి.


రైతులను ఆత్మహత్యల్లోకి నెట్టేస్తే ఎలా?
దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉంది. ప్రతి 36 నిమిషాలకు ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రభుత్వ రికార్డులే చెప్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దూకుడుగా భూసేకరణ బిల్లును తెస్తున్నారు.  మన ఆహార స్వీయ సమృద్ధి, ఆహార భద్రతలను ప్రమాదంలోకి నెడుతున్నారు. జాతీయ రహదారుల వెంట కిలోమీటరు మేర భూమిని పారిశ్రామిక కారిడార్ల కోసం తీసుకుంటారు. అంటే.. దేశంలోని మొత్తం సాగు భూమిలో 39.1 శాతం భూమిని తీసుకుంటారు. ఈ భూమిలో సాగును తీసివేస్తే.. మన ఆహార భద్రత ఏమవుతుంది? ‘అన్నదాత’ను ఆత్మహత్య చేసుకునే పరిస్థితిల్లోకి నెట్టివేస్తే.. ఎటు పోతున్నట్లు?’ అని ఏచూరి ప్రశ్నించారు.
 

మాది భవిష్యత్ పార్టీ...
‘ప్రపంచీకరణ యుగంలో వామపక్షాల అవసరం.. ప్రజా ప్రమేయంలో దాని శక్తి, సామర్థ్యాలపై ఆధారపడి ఉంటుంది. ప్రజా సంఖ్యాపరంగా చూస్తే ప్రపంచంలోని అత్యంత యువక దేశాల్లో భారత్ ఒకటి. ఆ కోణంలో మాది భవిష్యత్ పార్టీ. సిలికాన్ వ్యాలీ, నాసా, ‘దైవ కణం’పై పరిశోధనలు జరుగుతున్న స్విట్జర్లాండ్‌లోని సబ్ లేబరేటరీలను చూడండి. అక్కడ భారతీయ శాస్త్రవేత్తలు, మన యువత ముందువరుసలో ఉన్నారు.


15 శాతం మంది యువత ఉన్నత విద్యలోకి వెళ్లటం వల్లే దీనిని సాధించిగలిగినపుడు.. దానిని 40 శాతానికి పెంచగలగితే.. ప్రపంచ విజ్ఞాన సమాజానికి భారత్ నాయకుడిగా మారటాన్ని ఎవరూ నిలువరించలేరు. దీనికేం కావాలి? యువతకు సరైన ఆరోగ్యం, విద్య, ఉద్యోగ అవకాశాలు. ఏ విధానాలు వారికి వీటిని ఇవ్వగలవు. ఇక్కడే మా అవసరం ఉంటుంది’ అని ఏచూరి అన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement