
ప్రధాని నరేంద్ర మోదీ, పక్కన హీరాబెన్ మోదీ(జతచేయబడిన చిత్రం)
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ఆటోలో ప్రయాణిస్తున్న ఫోటో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. కేంద్ర మంత్రి విజయ్ సంపాలా తన ట్వీటర్‌లో ఆ ఫోటోను పోస్టు చేసి అభాసుపాలయ్యారు.
‘మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీగారి తల్లి ఇప్పటికీ ఆటోలోనే ప్రయాణిస్తున్నారు. కానీ, రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ ప్రపంచంలోనే ధనిక నేతల్లో నాలుగో స్థానంలో ఉన్నారు’ అంటూ ఆ ఫోటోను ఉంచారు. కానీ, ఆ ఫోటోలో నిశితంగా పరిశీలిస్తే హీరాబెన్ మోదీ కుడి మోచేతిని పట్టుకున్నట్లు ఓ చెయ్యి ఉంది. అది గమనించిన కొందరు అది మార్ఫింగ్ ఫోటో అంటూ కేంద్ర మంత్రిపై విమర్శలు గుప్పించారు.
నాలుగేళ్ల క్రితం ఫోటోను మార్ఫ్ చేసి దానిని ఇప్పుడు ఈ విధంగా వైరల్ చేస్తున్నారంటూ కొందరు మండిపడుతున్నారు. ఒకవేళ మంత్రి చెప్పినట్లు ఆ ఫోటో నిజమే అయితే తల్లి బాగోగులు పట్టించుకునే పరిస్థితిలో మన ప్రధాని లేరేమో అంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు. మొత్తానికి కేంద్ర మంత్రి అత్యుత్సాహంతో పోస్టు చేసిన ఆ మార్ఫింగ్ ఫోటోపై తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు.
Our Beloved PM Shri @narendramodi 's Mother is still travelling in Auto, While @RahulGandhi 's Mother is the World's 4th Wealthiest Politician!#NarendraModi pic.twitter.com/HsLuTBYUaI
— Vijay Sampla MoS (@vijay_sampla) 4 May 2018