న్యూఢిల్లీ: భారత ఆర్థిక సంస్కరణలు కొనసాగుతాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. శనివారం ఢిల్లీలో జరిగిన అడ్వాన్సింగ్ ఆసియా సదస్సులో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలకు భారత ఆర్థిక వ్యవస్థ ఓ ఆశాకిరణంగా ఉందన్నారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధి కోసం తమ విధానాలు కొనసాగుతాయని అన్నారు.
గత కొంతకాలంగా ఇండియా తన రూపాయి మారకపు విలువను తగ్గించుకోని విషయాన్ని మోదీ గుర్తు చేశారు. స్థూల ఆర్థిక స్థిరత్వానికి భారత్ను స్వర్గదామంగా ఆయన అభివర్ణించారు. ప్రజాస్వామ్యయుతమైన దేశంలో వేగవంతమైన ఆర్థిక వృద్ధిపై ఉన్నటువంటి అనుమానాలను భారత్ నివృత్తి చేసిందని మోదీ పేర్కొన్నారు. సామాజిక స్థిరత్వంతో కూడిన అభివృద్ధిని సాధించడంలో కూడా భారత్ విజయవంతం అయిందని మోదీ తెలిపారు. వరుసగా రైతులకు విపత్కరమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడిన ఈ సందర్భంలో కూడా భారత్ 7.6 శాతం వృద్ధి రేటును నమోదు చేసిన విషయాన్ని సదస్సులో మోదీ గుర్తుచేశారు.