
సాక్షి, న్యూఢిల్లీ : మహిళలపై లైంగిక దాడులకు పాల్పడే వారికి కఠిన శిక్షలు విధించడంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి చట్ట నిబంధనలే అత్యున్నతమని చెప్పారు. లైంగిక దాడులకు పాల్పడాలనే మృగాళ్లలో భయం కలిగించడం ముఖ్యమని అన్నారు. లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. 72వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బుధవారం ఎర్రకోటలో జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం ప్రధాని ప్రసంగించారు.
లైంగిక దాడుల ఆలోచన లేని సమాజం ఆవిష్కృతం కావాలన్నారు. లైంగిక దాడి కేసుల విచారణకు మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో త్వరితగతిన విచారణ చేపట్టి రోజుల వ్యవధిలోనే నిందితులకు మరణ దండన విధిస్తున్నారని, ఈ కేసులపై విస్తృత ప్రచారం కల్పించడం ద్వారా ఈ తరహా నేరాలకు వేరొకరు పాల్పడకుండా నిరోధించవచ్చన్నారు. ఎంత ప్రచారం కల్పిస్తే అంతగా నిందితుల్లో భయం నెలకొంటుందన్నారు. మహిళలను వేధించే వారి వెన్నులో వణుకుపుట్టేలా రేపిస్టులను ఉరితీసిన ఉదంతాలపై ప్రచారం జరగాలన్నారు. మహిళలపై నేరాలను మనం నిరోధించాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment