
అమ్మల సమక్షంలో మోదీ-షరీఫ్ మాట్లాడాలి!
బరెలీ (ఉత్తరప్రదేశ్): భారత్-పాకిస్థాన్ అన్నదమ్ముళ్లలాంటివి. కాబట్టి మన రెండు దేశాల ప్రధానమంత్రులు వారి అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే.. ఇరుదేశాల సమస్యలకు కచ్చితమైన పరిష్కారం దొరుకుతుందని అంటున్నారు ప్రముఖ ఉర్దూ కవి మునావరణ్ రాణా. 'ఇద్దరు ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్‌షరీఫ్ తమ అమ్మల సమక్షంలో చర్చలు జరిపితే ఇరుదేశాల సమస్యలకు తప్పక పరిష్కార మార్గం దొరుకుతుంది. అమ్మలు చెంత ఉన్నప్పుడు ఎంతటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుంది' అని ఆయన మంగళవారం ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు.
భారత్, పాకిస్థాన్‌లు అన్నదమ్ముళ్లని, అందుకే పొరుగు దేశాన్ని ఇటీవల సందర్శించడం, నవాజ్ షరీఫ్ తల్లి పాదాలకు నమస్కరించడం ద్వారా అన్నగా తన బాధ్యతను ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిర్వర్తించారని మునావర్ రాణా ప్రశంసించారు. ఇప్పుడు తదుపరి చొరవ తీసుకోవాల్సిన బాధ్యత షరీఫ్‌పై ఉందన్నారు. మునావర్ రాణా ఇటీవల తనకు ప్రకటించిన సాహిత్య అకాడమీ అవార్డును తిరస్కరించిన సంగతి తెలిసిందే. తాను కానీ, తన కొడుకు కానీ ప్రభుత్వ అవార్డులు తీసుకోరాదని నిర్ణయించామని ఆయన మరోసారి స్పష్టం చేశారు.