న్యూఢిల్లీ: ఎన్డీఏ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారుతోందంటూ తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ సీనియర్ నాయకుడు యశ్వంత్ సిన్హా తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కేంద్రం తన విధానాలను మార్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. యశ్వంత్ వ్యాఖ్యలను ఆయన కుమారుడు, కేంద్ర మంత్రి జయంత్ సిన్హా కొట్టిపారేశారు.
ఈ నేపథ్యంలో యశ్వంత్ గురువారం మీడియాతో మాట్లాడుతూ... దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలపై వివరించేందుకు ఏడాది క్రితమే ప్రధాని మోదీ అపాయిమెంట్ కోరినా దొరకలేదని వెల్లడించారు. అందుకే తన అభిప్రాయాలను మీడియా ద్వారా తెలియజేశానన్నారు. ‘నాకు తలుపులు మూసుకుపోయాయని అర్థమైంది. ఇక మాట్లాడ్డానికి మీడియా తప్ప మరో మార్గం కనిపించలేదు.
ప్రధాని మోదీకి చెప్పేందుకు నా వద్ద విలువైన సూచనలు ఉన్నాయి’ అని అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీ అమలుపై మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం లాంటి ఆర్థికవేత్తల అభిప్రాయాలను ఏ ప్రభుత్వమైనా పెడచెవిన పెట్టరాదని సూచించారు. ప్రభుత్వంపై అసంతృప్తితోనే విమర్శలు చేస్తున్నారా అని ప్రశ్నించినపుడు యశ్వంత్... ఇది తనపై చేసిన అత్యంత చవకబారు ఆరోపణ అని బదులిచ్చారు. సాంకేతికంగా ఇంకా తాను బీజేపీలో భాగమేనని చెప్పారు.
ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడిన తన కొడుకు జయంత్ తీరును కూడా యశ్వంత్ తప్పుపట్టారు. ఇలాంటి వాటిపై పార్టీ అధికార ప్రతినిధి లేదా సంబంధిత మంత్రి వ్యాఖ్యానించాలని, జయంత్ ఏ హోదాలో స్పందించారని ప్రశ్నించారు. జయంత్‌కు అంత ప్రముఖ స్థానం ఉన్నట్లయితే ఆర్థిక శాఖ నుంచి తప్పించి విమానయాన శాఖకు ఎందుకు మార్చారని నిలదీశారు. తాను, తన కొడుకు తమతమ విధులు నిర్వర్తిస్తున్నామని, ఇది తండ్రీకొడుకుల మధ్య సమస్యగా చూడొద్దని చెప్పారు.
‘నవభారతం’ కోసమే: జయంత్
యశ్వంత్ సిన్హా ఆంగ్ల దిన పత్రికలో రాసిన వ్యాసాన్ని జయంత్ ప్రస్తావిస్తూ...భారత ఆర్థి క వ్యవస్థపై గతంలో ఎన్నో కథనాలు వెలువడ్డాయని, కానీ ఈ వ్యాసం కొన్ని పరిమిత గణాంకాలు, సమాచారంపై ఆధారపడి ఉందని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పులకు కారణమవుతున్న మౌలిక సంస్క రణలను విస్మరించిందని అన్నారు. నవ భారతం, ఉద్యోగ సృష్టికి ఈ నిర్మాణాత్మక సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు.
80 ఏళ్ల వయసులో పని కోసమే ఇలా..
ఆర్థిక వ్యవస్థపై యశ్వంత్ సిన్హా ఆరోపణలకు సంబంధించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పెదవి విప్పారు. ఆర్థిక మంత్రిగా ఆయన తన చెత్త రికార్డును మరచిపోయి, విధానాలపై కాకుండా వ్యక్తులపై వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. 80 ఏళ్ల వయసులో ఉద్యోగం కోసం ఇలా వ్యవహరిస్తున్నారని అన్నారు. గతంలో యశ్వంత్, మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఒకరిపై ఒకరు పరుష పదజాలం వాడారని, కానీ ఇప్పుడు ఇద్దరు కూడబలుక్కుని ఒకే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.