'ఆ మూడింటితో గెలవలేరు'
న్యూఢిల్లీ: గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో చివరికి ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యానించింది. గుజరాత్‌లో అత్యంత ఉఠ్కంతభరితంగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ గెలిచారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నించిన బీజేపీ నాయకులకు పటేల్ గెలుపు కనువిప్పు కావాలని కాంగ్రెస్ పేర్కొంది.
'డబ్బు, కండబలం, కుతంత్రంతో విజయం సాధించలేరు. కాంగ్రెస్ పార్టీలో కొంతమంది బలహీన ఎమ్మెల్యేలను బీజేపీ చీల్చింది. కానీ పార్టీని చీల్చలేకపోయింద'ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ట్వీట్ చేశారు. ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరును ఆయన ప్రశంసించారు.
యుద్ధంలో గెలవడం కష్టమేనని, విజయం సాధించేందుకు ప్రభుత్వం చాలా కష్టపడిందని చివరకు ప్రజాస్వామ్యం గెలిచిందని కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అహ్మద్ పటేల్‌కు ఆమె అభినందనలు తెలిపారు. గుజరాత్ రాజ్యసభ ఎన్నికల్లో సత్యం గెలిచిందని, అహం ఓడిపోయిందని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జివాల్ అన్నారు. అహ్మద్ పటేల్ విజయంతో బీజేపీ చెప్పిందంతా బూటకమని తేలిపోయిందని ఎద్దేవా చేశారు.