పగతో రగిలిపోతున్న వానరం..
పాట్నా : మనుషులే కాదు జంతువులు కూడా పగ, ప్రతీకారాలు తీర్చుకుంటాయని ఓ వానరం రుజువు చేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు..ముగ్గురు రైల్వే డ్రైవర్లపై ఆ కోతి దాడికి పాల్పడింది.ఈ సంఘటన బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో చోటుచేసుకుంది. చంపారన్ జిల్లా వాల్మికీ రైల్వే స్టేషన్ వద్ద ఓ కోతి గత వారం గూడ్స్ రైలు కింద పడి మృతి చెందింది. దాంతో తోబుట్టువు అయిన మరో కోతి... రైలు డ్రైవర్‌పై ప్రతీకారం పెంచుకుంది. వరుసగా దాడులు చేయటం మొదలు పెట్టింది.
ఈ సంఘటనలపై రైల్వే అధికారి ఏకె ఝా మాట్లాడుతూ ఆ కోతి అనుకోకుండా రైల్వే డ్రైవర్లపై దాడి చేసినట్లు లేదని, దాని తోబుట్టువులు లేదా బంధువుల మృతికి పగ తీర్చుకోవడానికే ఈ దాడులకు పాల్పడి ఉండవచ్చన్నారు. గత వారం వాల్మీకి నగర్ రైల్వే స్టేషన్లో ఓ వానరం గూడ్స్ రైలు వెనక పరుగులు పెట్టిందని ఆయన చెప్పారు. శనివారం గూడ్స్ రైలు డ్రైవర్ పై వానరం దాడి చేయగా రైల్వే అధికారులు అతడిని కాపాడారని పేర్కొన్నారు. మరో గూడ్స్ రైలు డ్రైవర్పై దాడి చేయగా, ఇంజిన్ క్యాబిన్లో లాక్ చేసుకుని డ్రైవరే స్వయంగా తనను తాను కాపాడుకోవాల్సి వచ్చిందన్నారు.
ఇంకో గూడ్స్ డ్రైవర్పై దాడికి యత్నించగా అతడు పంపిన మెసెజ్కు స్పందించిన రైల్వే అధికారులు అతికష్టం మీద డ్రైవర్ను రక్షించారని ఝా వివరించారు. ఈ సంఘటనలతో రైల్వే డ్రైవర్లు ఆందోళనకు గురవుతున్నారు. దాంతో వాల్మికీ రైల్వే స్టేషన్లో రైలు ఆపాలంటేనే భయపడుతున్నారు.