
సాక్షి, కాన్పూర్ : కాన్పూర్‌లోని ఒక టోల్ బూత్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. టోల్‌బూత్‌లోకి చొరబడిన ఒక కోతి అక్కడున్నగల్లా పెట్టెలోని డబ్బులను చాలా ఒడుపుగా లాక్కుపోయింది. ఏప్రిల్ 25న కాన్పూర్ డిహత్ ప్రాంతంలోని బారా టోల్ ప్లాజాలో జరిగిన ఈ ఘటన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో వీడియో వైరల్ అవుతోంది.
సీసీటీవీ ఫుటేజిలోని వీడియో ప్రకారం.. టోల్ బూత్ వద్ద ఒక తెల్ల కారు ఆగింది. ఒక కోతి దాని నుండి దూకి.. విండోంలోంచి బూత్‌లోకి ప్రవేశించింది. అక్కడున్న ఉద్యోగి భుజం మీద నుంచి దర్జాగా నేరుగా క్యాష్ బ్యాక్స్‌లో ఉన్న నగదును లాక్కుని ఉడాయించింది. ఏం జరుగుతోందో అక్కడున్న అపరేటర్‌కి అర్థమయ్యేలోపే క్షణాల్లో ఇదంతా జరిగిపోయింది.
దీనిపై టోల్ మేనేజ్‌మెంట్ సీనియర్ అధికారి మనోజ్ శర్మ మాట్లాడుతూ.. కోతి ఎత్తుకెళ్లిన సొమ్ము మొత్తం 5 వేల రూపాయలని చెప్పారు. ఈ విషయంలో కోతికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వుంటారని అభిప్రాయపడ్డారు. గతంలో కూడా ఇలాంటి సంఘటన జరిగిందన్నారు. తాజా ఘటనపై ఫిర్యాదు నమోదు చేశామని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని శర్మ చెప్పారు. మరోవైపు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని కారు డ్రైవర్ వాదిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment