
దేశంలో అత్యంత చెత్త నగరం ఏదో తెలుసా ?
దేశంలో అత్యంత చెత్తనగరం ఏదో తెలుసా..? దేశంలోని పది అత్యంత మురికినగరాల్లో ఐదు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత చెత్తనగరం ఏదో తెలుసా..? దేశంలోని పది అత్యంత మురికినగరాల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. ఇందులో ఐదు ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. గురువారం విడుదల చేసిన ఈ చెత్త నగరాల జాబితాలో యూపీలోని గోండా ప్రథమ స్థానంలో నిలిచింది. తర్వాత స్థానం మహారాష్ట్రలోని భుసావల్‌కు, బిహార్ రాష్ట్రం బగహా, యూపీలోని హర్దోయి నగరాలకు మూడు, నాలుగు స్థానాలు దక్కాయి. అపరిశుభ్ర నగరాల జాబితాలో యూపీలోని బహ్రాయిచ్ ఆరు, షాజహాన్‌పూర్ తొమ్మిది, ఖుర్జా పదో స్థానాల్లో ఉండగా బిహార్‌లోని కటిహార్ ఐదో స్థానంలో నిలిచింది. దీంతోపాటు పంజాబ్‌లోని ముక్తసర్‌కు ఏడో స్థానం, అబోహార్‌కు ఎనిమిదో స్థానం దక్కాయి.
గురువారం విడుదల చేసిన స్వచ్ఛ నగరాల ర్యాంకుల్లో టాప్ 5లో ఇండోర్, భోపాల్, విశాఖపట్నం(వైజాగ్) సూరత్, మైసూరు ఉన్నాయి. తొలి 50 ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాలు వైజాగ్(3), తిరుపతి (9), విజయవాడ(19), గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(22), వరంగల్(28), సూర్యాపేట(30), తాడిపత్రి (31), నరసారావుపేట(40), కాకినాడ(43), తెనాలి(44), సిద్దిపేట(45), రాజమండ్రి (46) ర్యాంకులను సొంతం చేసుకున్నాయి.