సాక్షి, భోపాల్ : దేశంలో పలు రాష్ట్రాల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లోనే ఇవి అధికంగా కనిపించటం గమనార్హం. అయితే తమ డిమాండ్లను కోసం రోడెక్కుతున్న అన్నదాతలను పట్టించుకోకపోగా... అణచివేత ధోరణిని ప్రదర్శించటంతో ఆయా ప్రభుత్వాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.
తాజాగా మధ్యప్రదేశ్‌లో పోలీస్ స్టేషన్‌లోనే రైతులను బట్టలు విప్పి కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. మానవ హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి, డీజీపీలను నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలంటూ ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ సరఫరా, నీటి సమస్యలపై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా అందులో రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి దారుణంగా చితకబాదారు.
అయ్యా... నా బట్టలు విప్పొద్దు. నా లో దుస్తులకు రంధ్రాలు ఉన్నాయని వేడుకున్నా.. వినకుండా బట్టలు విప్పించి కొట్టారని 45 ఏళ్ల బల్వాన్ సింగ్ ఘోష్ అనే రైతు ‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. నా పంట నాశనం అయ్యింది. నిరసనలో పాల్గొంటే ప్రయోజనం దక్కుతుంది అనుకున్నా. కానీ, పరిహారంగా పోలీసుల చేతిలో తన్నులు తినాల్సి వచ్చింది అని బల్వాన్ చెప్పాడు. టికమ్‌గఢ్ డేహట్ పోలీస్ స్టేషన్‌లో బల్వాన్‌సహా ఐదుగురు రైతులను పోలీసులు చావబాదారనే ఆరోపణలు వినిపించాయి.
తొలుత అలాంటిదేం వాదించిన రాష్ట్ర ప్రభుత్వం.. వారిని వివస్త్రులుగా చేసి బాదుతున్నట్లు ఫోటోలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో నీళ్లు నమిలింది. దీంతో డీజీపీ నేతృత్వంలో గురువారం ఓ విచారణ కమిటీని నియమించిన ప్రభుత్వం మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అయితే రైతులు స్వయంగా బట్టలు విప్పి నిరసన తెలిపారా? లేక పోలీసులే ఆ పని చేశారా? అన్నది తేలాల్సి ఉందని హోం శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ తెలిపారు. మరోవైపు బీజేపీ మాత్రం ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్న డ్రామా అని చెబుతుండగా.. పోలీస్ దెబ్బలు తిన్న అమోల్ సింగ్ ఘోష్ అనే మరో రైతు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. తామేం కాంగ్రెస్ కార్యకర్తలం కాదని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment