
అమ్మను కాదు అక్కను
రాజ్యసభలో మోగా బాలిక ఉదంతంపై మంగళవారం గందరగోళం నెలకొన్న దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తోటి తెలుగు ఎంపీ రేణుకా చౌదరిని 'అమ్మా' అంటూ సంబోధించి సరదా సంభాషణకు తెరతీశారు.
న్యూఢిల్లీ: రాజ్యసభలో మోగా బాలిక ఉదంతంపై మంగళవారం గందరగోళం నెలకొన్న దశలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తోటి తెలుగు ఎంపీ రేణుకా చౌదరిని 'అమ్మా' అంటూ సంబోధించి సరదా సంభాషణకు తెరతీశారు. వాతావరణాన్ని తేలికపర్చారు. కాంగ్రెస్ మోగా ఘటనను లేవనెత్తినపుడు... విపక్ష పార్టీలు రాజకీయ అంశాలను లేవనెత్తుతున్నాయని, ఆ రాష్ట్రానికి (పంజాబ్) చెందిన వారికీ మాట్లాడే అవకాశమివ్వాలని వెంకయ్య రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పి.జె.కురియన్‌ను కోరారు.
ఆయనసలు మా మాట వింటున్నారా సర్’ అని వెంకయ్యనుద్దేశించి రేణుకా చౌదరి అన్నారు. దీనికి వెంకయ్య స్పందిస్తూ 'వింటూనే ఉన్నాం.. అమ్మా' అని అన్నారు. వెంటనే రేణుక స్పందిస్తూ 'అమ్మ అటువైపే ఉంది. నేను అక్కను' అని అన్నారు. కురియన్‌కు ఈ తెలుగు పదాల అర్థాలను వివరిస్తూ... ఎవరిపైనైనా ఆప్యాయత, ప్రేమ ఉన్నా... వారిని అమ్మా అని పిలుచుకుంటామని వెంకయ్య చెప్పారు. తన మనవరాలిని కూడా ఇలాగే అమ్మా అని పిలుస్తానన్నారు. రేణుకపై ఆప్యాయతతో అలా పిలిచానన్నారు. మోగా ఘటనపై చర్చకు పట్టుబడుతూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి నేనాయన (వెంకయ్యనాయుడు)ను 'అన్నా'అని సంబోధిస్తున్నా... తమ్ముళ్లు మాట్లాడేటపుడు అన్నలు వినాలన్నారు.