
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
ఢిల్లీ: మధ్యప్రదేశ్లో దళితులపై దాడి అంశంపై బుధవారం రాజ్యసభ దద్దరిల్లింది. ప్రభుత్వం దళిత వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని నినాదాలు చేస్తూ విపక్షాల ఎంపీలు పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఈ సందర్భంగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. గోసంరక్షణ పేరుతో దళితులపై దాడులు చేయడం సరికాదన్నారు. దేశవ్యాప్తంగా దళితులు, మైనారిటీలపై దాడులు జరుగుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళలకు అనుకూలమైన ప్రభుత్వంగా చెప్పుకుంటున్న బీజేపీ పాలనలో మధ్యప్రదేశ్లో బీఫ్ పేరుతో మహిళపై దాడి జరగడాన్ని బీఎస్పీ నాయకురాలు మాయావతి తీవ్రంగా ఖండించారు. కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సమాధానమిస్తూ.. దేశంలో దళితులపై ఎక్కడ దాడులు జరిగినా సమర్థించబోం అని స్పష్టం చేశారు. బాధ్యులపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.