ఢిల్లీ పీఠమే లక్ష్యంగా.... ములాయం, జయలలిత
లక్నో: ఢిల్లీ పీఠం కోసం పోటీపడే పార్టీల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే అన్నాడీఎంకే ఈ దిశగా సందేశాలు ఇవ్వగా.. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో అధికారిక సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) కూడా ఢిల్లీ పీఠాన్ని గెలుచుకోవడమే తమ లక్ష్యమని ప్రకటించింది. తమ పార్టీ ఏకైక లక్ష్యం ఢిల్లీని గెలుచుకుని, దేశంలో మతతత్వ శక్తులను ఓడించడమేనని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అన్నారు. లక్నోలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ములాయం ఈ మేరకు సరికొత్త సందేశాన్నిచ్చారు. పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేయడం వల్లే ఉత్తరప్రదేశ్‌లో అధికారాన్ని సొంతం చేసుకోగలిగామన్నారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ప్రభుత్వాలు చేయని రీతిలో మంచి కార్యక్రమాలను తాము యూపీలో అమలు చేశామని వివరించారు. దీన్ని ప్రచారం చేసుకోవాల్సి ఉందన్నారు. యూపీలో అత్యధిక లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటే మతతత్వ శక్తులు ఓడిపోయినట్లేనని పేర్కొన్నారు. గరిష్ట స్థానాలతో నిర్ణయాత్మక శక్తిగా ఉంటే తదుపరి కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో ఎస్పీదే కీలక పాత్ర అవుతుందని చెప్పారు. గుజరాత్‌లో అల్లర్లకు కారణమైన బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి మతతత్వాన్ని విస్తరింపజేయడానికి ప్రయత్నిస్తున్నారని.. ఇది అందరికీ తెలుసునని, ఎస్పీ ఒక్కటే బీజేపీని ఒడించగలదని ప్రజలు భావిస్తున్నారని వివరించారు.
‘అమ్మ’ కోసం కార్యకర్తల ప్రతిన
సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను ప్రధాని చేసే వరకు విశ్రమించబోమని అధికార అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఎంజీఆర్ సమాధి సాక్షిగా ప్రతిజ్ఞ చేశారు. ‘చెన్నైలోని జార్జికోట (సచివాలయం) మనదే, ఢిల్లీలోని ఎర్రకోట మనదే’ అంటూ నినదించారు. దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్ 26వ వర్ధంతిని పురస్కరించుకుని అన్నాడీఎంకే ఆధ్వర్యంలో ఎంజీఆర్‌కు మంగళవారం నివాళులర్పించే కార్యక్రమం జరిగింది. సీఎం జయలలిత, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు మెరీనా బీచ్ వద్ద ఉన్న ఎంజీఆర్ సమాధి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకుని ఘన నివాళులర్పించారు. అనంతరం, పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదన్ అమ్మ (జయలలిత)ను పీఎం చేసేదాకా ఏ ఒక్క కార్యకర్తా నిద్రపోడని పేర్కొంటూ నేతలు కార్యకర్తలతో భవిష్యత్ ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయించారు. రాష్ట్రంలోని మొత్తం లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుని ఢిల్లీలో అమ్మ కొలువుదీరేదాకా విశ్రమించబోమని వారితో చెప్పించారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 39 స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానాన్ని గెలుచుకునేందుకు అకుంఠిత దీక్షతో కృషి చేస్తాం. అమ్మ ప్రధాని అయితేనే దేశంలో మతసామరస్యం, అన్ని రంగాల అభివృద్ధి సాధ్యమవుతుంది. అమ్మ ప్రధాని అయ్యే రోజులు సమీపిస్తున్నారుు. ఈ లక్ష్య సాధనకు కలసికట్టుగా పనిచేస్తాం’ అని చెప్పించారు.