Jayalalitha
సాక్షి, చెన్నై: ప్రధాని పీఠాన్ని ఇప్పటి వరకూ ఎన్నో రాష్ట్రాలకు చెందిన వారు చేపట్టారని.. ఈసారి ఆ అవకాశం తమిళులకు వస్తుందని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అన్నారు. భారతదేశ భవిష్యత్తు అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తల చేతుల్లో ఉందన్నారు. జయలలిత అధ్యక్షతన అన్నాడీఎంకే పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం ఇక్కడ జరిగింది. లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయూలని ఈ సమావేశంలో తీర్మానించారు.
అయితే, ఏ పార్టీవారైనా తమతో కలిసి రావాలనుకుంటే నిర్ణయం తీసుకునే అధికారాన్ని అమ్మ(జయలలిత)కే అప్పగిస్తున్నట్లు మరో తీర్మానం కూడా చేశారు. ఇలా మొత్తం 16 తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా జయలలిత మాట్లాడుతూ.. పొత్తులు లేకుండానే త మిళనాడు, పుదుచ్చేరిలోని 40 ఎంపీ సీట్లు గెలిచే సత్తా అన్నాడీఎంకేకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రాన్ని శాసించే స్థాయిలో రికార్డు గెలుపునకు కంకణబద్ధులు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రజలు అన్నాడీఎంకేపై నమ్మకం పెట్టుకున్నారని, దాన్ని వమ్ము చేయకూడదని పార్టీ శ్రేణులకు సూచించారు. దక్షిణాదిన ప్రధాని పీఠం చేపట్టడానికి జయలలితకు తగిన అర్హత ఉందని మాజీ ప్రధాని, జేడీఎస్ నేత దేవెగౌడ ఇటీవలే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ దిశగానే జయలలిత కూడా పార్టీ శ్రేణులకు సందేశం ఇవ్వడం విశేషం.
జయలలితకు అన్ని అర్హతలు: జయలలిత పాలనాదక్షత, బహుముఖ నైపుణ్యాలను ప్రస్తుతిస్తూ సర్వసభ్య సమావేశంలో తీర్మానించినట్లు అన్నాడీఎంకే పార్టీ వెల్లడించింది. జయలలిత అసాధారణ దేశభక్తురాలని, నేతగా అన్ని భాషలు, మతాలను సమానంగా గౌరవించారని తెలిపింది. దేశాన్ని సూపర్‌పవర్‌గా మార్చేందుకు ఆమె తగిన వారని పేర్కొంది. ఆ దిశగా(ప్రధానిగా) జయలలితకు సానుకూల పరిస్థితి కల్పించేందుకు రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలతోపాటు పుదుచ్చేరిలోని ఒక స్థానాన్నీ కైవసం చేసుకునేందుకు కృషి చేయనున్నట్లు ప్రకటించింది. ప్రధాని పదవికి జయలలిత పేరు వినిపిస్తున్న తరుణంలో దాన్ని బలంగా ముందుకు తీసుకెళ్లాలని అన్నాడీఎంకే నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.