సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. తరచుగా పాత భవనాలు కూలిపోయే ముంబైలో మంగళవారం మధ్యాహ్నం కూడా అదే ప్రమాదం జరిగి, పదకొండు మంది మరణించారు. మరో 40 మందికిపైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిలో ఎంత మంది ప్రాణాలతో ఉంటారన్న విషయాన్ని ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. డోంగ్రీ ప్రాంతంలోని ఇరుకుగా ఉండే తండేల్ వీధిలోని కేసర్‌బాయి భవనం వందేళ్ల క్రితం నాటిది. నాలుగు అంతస్తుల ఈ భవనం మంగళవారం దాదాపు 11.30 గంటల సమయంలో కుప్పకూలింది. ఇందులో 10 నుంచి 15 కుటుంబాలు నివసించేవి. చనిపోయిన వారిలో ఆరుగురు పురుషులు, నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నట్లు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్డీఆర్‌ఎఫ్) తెలిపింది.
మరో ఎనిమిది మంది గాయపడ్డారని వెల్లడించింది. ఈ భవనం దాదాపు వందేళ్ల క్రితం నిర్మించినదనీ, అయితే దీనిని పునర్‌అభివృద్ధి చేసేందుకు నిర్ణయించినందు వల్ల అది పాడుబడిన భవనాల జాబితాలో లేదని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చెప్పారు. ముంబై మేయర్ విశ్వనాథ్ మహాదేశ్వర్ మాట్లాడుతూ ఈ ఘటనపై విచారణ జరపాల్సిందిగా తాను బీఎంసీ కమిషనర్‌ను ఆదేశించానన్నారు. భవనంలోని వారికి ఆశ్రయం కల్పించడం కోసం ఇమామ్‌వాడ బాలికల నగరపాలక ఉన్నత పాఠశాలలో బీఎంసీ అధికారులు శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శిథిలాలను తొలగించి, వాటి కింద ఇరుక్కున్న వారిని రక్షించే ప్రయత్నాలు మంగళవారం రాత్రి సమయానికి కూడా కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా 10 నుంచి 12 కుటుంబాలు శిథిలాల కింద చిక్కుకునే ఉన్నాయని తాము భావిస్తున్నట్లు ముంబాదేవి ఎమ్మెల్యే అమిన్ పటేల్ చెప్పారు. శిథిలాల కింద నుంచి బాధితులను రక్షించి, క్షతగాత్రులను వైద్యశాలలకు తరలిస్తున్నారు.
ఇరుకు వీధులతో సహాయక చర్యలకు ఇబ్బంది
ఈ భవనం మహారాష్ట్ర గృహ, ప్రాంతీయ అభివృద్ధి సంస్థ (ఎంహెచ్‌ఏడీఏ)కు చెందినదని స్థానికులు చెబుతుండగా, ఎంహెచ్‌ఏడీఏ మరమ్మతుల విభాగం చీఫ్ వినోద్ ఘోసాల్కర్ ఆ భవనం తన సంస్థకు చెందినదికాదని అంటున్నారు. చట్టసభలో సభ్యుడైన భాయ్ జగ్తాప్ మాట్లాడుతూ భవనం పాడుబడినందున తక్షణమే జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆ భవనంలో నివాసం ఉంటున్నవారు కోరినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ముంబైలో ఇప్పటివరకు 500 భవనాలను పాడుబడినవిగా గుర్తించినా, కేవలం 68 భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించామని బీఎంసీ అధికారి ఒకరు చెప్పారు. అగ్నిమాపక దళం, ముంబై పోలీసులు, బీఎంసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరుకైన వీధులు ఉండటంతో అంబులెన్స్‌లు, శిథిలాలను తొలగించే యంత్రాలు అక్కడకు చేరుకోలేకపోయాయి. స్థానికులే మానవహారంగా ఏర్పడి తమ ఒట్టి చేతులతో శిథిల వ్యర్థాలను పక్కకు తీసేస్తున్నారు.
ఇరుకు సందులతో సహాయక కార్యక్రమాలు ముందే నెమ్మదిగా సాగుతుండగా, ఘటనా స్థలానికి మంత్రులు, ఎమ్మెల్యే, ఎంపీలు తదితరులు ఎక్కువ సంఖ్యలో చేరుకోవడంతో సహాయక చర్యలు మరింత ఆలస్యం అయ్యాయి. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు మిలింద్ దేవ్‌రా మాట్లాడుతూ ‘ముంబైలో వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రతి ఏడాదీ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గోడలు కూలుతాయి, రోడ్లపై గుంతలు ఏర్పడి ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతున్నారు. మ్యాన్‌హోళ్లలోకి ప్రమాదవశాత్తూ పడి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మళ్లీ మళ్లీ వస్తున్న ఈ సమస్యకు ముంబై ప్రజలు సమాధానం అడగాల్సిన సమయం ఇదే’ అని అన్నారు. ఈ నెల మొదట్లోనే ముంబైలో కురిసిన భారీ వర్షాలకు గోడలు కూలి 20 మందికిపైగా చనిపోయారు. ఈ ఏడాది మార్చిలోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ బయట పాదచారుల వంతెన పాక్షికంగా కూలి ఐదుగురు చనిపోయారు. గతేడాది జూలైలోనూ అంధేరిలో గోఖలే వంతెన పాక్షికంగా కూలి ఇద్దరు మరణించారు. ముంబైలో వర్షా కాలంలో భవనాలు, వంతెనలు కూలడం మామూలైపోయింది.
Comments
Please login to add a commentAdd a comment