‘తలాక్‌’కు సంఘ బహిష్కరణ | Muslim Board calls for social boycott of those who resort to triple talaq | Sakshi
Sakshi News home page

‘తలాక్‌’కు సంఘ బహిష్కరణ

Published Tue, May 23 2017 1:31 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

‘తలాక్‌’కు సంఘ బహిష్కరణ - Sakshi

‘తలాక్‌’కు సంఘ బహిష్కరణ

ముస్లిం పర్సనల్‌ లా బోర్డు నిర్ణయం
► భార్యాభర్తల వివాద పరిష్కారానికి నియమావళి జారీ
► ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా ఖాజీలకు సలహా ఇస్తామని వెల్లడి


న్యూఢిల్లీ: ట్రిపుల్‌ తలాక్‌ చెప్పే ముస్లింలకు సంఘ బహిష్కరణ విధించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు(ఐఏఎంపీఎల్‌బీ) నిర్ణయించింది. ట్రిపుల్‌ తలాక్‌ పాటించొద్దంటూ పెళ్లికొడులకు చెప్పాలని ఖాజీలకు సలహావళి జారీ చేస్తామని సోమవారం సుప్రీం కోర్టుకు అఫిడవిట్‌లో తెలిపింది. షరియత్‌ ప్రకారం ట్రిపుల్‌ తలాక్‌ అవాంఛనీయమని, భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలని సూచించింది.

దీనికి సంబంధించి భార్యాభర్తల కోసం షరియత్‌కు అనుగుణంగా ప్రవర్తనా నియమావళిని జారీ చేసింది. దంపతుల మధ్య రాజీ కుదరని పరిస్థితిలో తప్పనిసరైతే ఒకసారి తలాక్‌ చెప్పొచ్చని, ఒకేసారి మూడు తలాక్‌లు చెప్పకూడదని స్పష్టం చేసింది. ‘‘గత నెల 15–16న జరిగిన మా వర్కింగ్‌ కమిటీ భేటీలో ట్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేశాం. నిష్కారణంగా ట్రిపుల్‌ తలాక్‌తో విడాకులివ్వడాన్ని షరియత్‌ తీవ్రంగా ఖండిస్తుంది.. ఈ సందేశాన్ని ముస్లింలలోని అన్ని వర్గాలకు.. ముఖ్యంగా పేదలకు చేరవేసేందుకు అన్ని విధాలా యత్నించాలి. మసీదుల్లోని ఇమాంల, బోధకుల సహాయం తీసుకోవాలి. ఈ అంశంపై ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తాం’’ అని బోర్డు తెలిపింది.

ట్రిపుల్‌ తలాక్‌ వద్దని పెళ్లికొడుకులకు చెప్పండి..
భార్యతో విభేదాలేవైనా వస్తే ట్రిపుల్‌ తలాక్‌ పాటించొద్దని నిఖానామా సమయంలో పెళ్లికొడుకులకు చెప్పాలని ఖాజీలను కోరాతామని ముస్లిం పర్సనల్‌ లా బోర్డు తెలిపింది. తమ వెబ్‌సైట్, ప్రచురణలు, సోషల్‌ మీడియా వేదికల ద్వారా సలహావళిని జారీ చేయాలని నిర్ణయించామంది. భర్త ట్రిపుల్‌ తలాక్‌కు చెప్పకూడదనే షరతును నిఖానామాలో పొందుపరచాలని వధూవరులకు నిఖా జరిపించే వ్యక్తి సూచిస్తారని అఫిడవిట్‌లో తెలిపింది. ఈ అఫిడవిట్‌ను చీఫ్‌ జస్టిస్‌ జేఎస్‌ ఖేహర్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించనుంది. ట్రిపుల్‌ తలాక్‌ రాజ్యాంగ బద్ధతను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ఈ ధర్మాసనం తన తీర్పును గత వారం రిజర్వులో ఉంచడం తెలిసిందే.

అఫిడవిట్‌పై విమర్శలు
ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సుప్రీం కోర్టుకు అందజేసిన అఫిడవిట్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు గందరగోళాన్ని సృష్టించిందని ట్రిపుల్‌ తలాక్‌ను సుప్రీం కోర్టులో సవాల్‌ చేసిన ఫరా ఫైజ్‌ ఆరోపించారు.బోర్డు ప్రైవేటు సంస్థ అని, అది ఖాజీలకు ఇచ్చే ఆదేశాలు అందరికీ వర్తించవని భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌ పేర్కొంది.  

భార్యాభర్తలకు బోర్డు నియమావళి
వివాదాన్ని భార్యాభర్తలు తొలుత పరస్పర సంప్రదింపులతో పరిష్కరించుకోవాలి. ఒకరి తప్పులను ఒకరు మరచిపోయేందుకు యత్నించాలి. అప్పటికీ ఫలితం లేకపోతే తాత్కాలికంగా విడిగా ఉండాలి.
అలా పరిష్కారం కాకపోతే ఇద్దరి తరఫు కుటుంబాల్లోని పెద్దలు రాజీకి ప్రయత్నించాలి. ఫలితం లేకపోతే విడాకులు తీసుకోవచ్చు. అప్పుడు కూడా తలాక్‌ అని ఒకసారి మాత్రమే చెప్పాలి. ఇద్దత్‌(వేచి ఉండే కాలం) వరకు భార్యాభర్తలు దూరంగా ఉండాలి. ఇద్దత్‌లో సమస్య పరిష్కారమైతే తిరిగి భార్యాభర్తలుగా జీవించవచ్చు. పరిష్కారం కాకపోతే ఇద్దత్‌ ముగిశాక వివాహం రద్దు అవుతుంది. ఇద్దత్‌ కాలంలో భార్య గర్భిణి అయితే ఇద్దత్‌ను ప్రసవం వరకు పొడిగించాలి. ఇద్దత్‌ తర్వాత రాజీ కుదిరితే విడిపోయిన జంట మళ్లీ పెళ్లాడి వివాహాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
⇒  విడాకులకు మరో పద్ధతినీ అనుసరించవచ్చు. తొలి తలాక్‌ చెప్పిన తర్వాత, రెండో నెలలో మరో తలాక్, మూడో నెలలో మరో తలాక్‌ చెప్పి తద్వారా విడాకులు పొం దొచ్చు. మూడో తలాక్‌ ముందు రాజీ కుదిరితే తిరిగి భార్యాభర్తలుగా ఉండొచ్చు. భర్తతో కలసి ఉండటం ఇష్టం లేకపోతే భార్య ‘ఖులా’ ద్వారా విడాకులు పొందొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement