న్యూఢిల్లీ : ఢిల్లీ సామ్రాజ్యానికి రారాణిగా సరిగ్గా 800 సంవత్సరాల క్రితం రజియా సుల్తాన్ ఎన్నికై ఢిల్లీ తొలి మహిళా పాలకులుగా చరిత్ర సృష్టించిన విషయం తెల్సిందే. యుద్ధరంగంలో పోరాడిన అనుభవం, ధైర్య సాహసాలతో పాటు నీతి, నిజాయితీ, వివేచన, విజ్ఞానం కలిగినప్పటికీ ఆమె ఆ పదవికి ఎన్నికవడానికి ఆదిలో పలు అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మహిళ కావడమే అందుకు కారణం. ఉలేమా (ముస్లిం గురువులతో కూడిన మండలి) ఆమె ఎన్నికకు తొలుత అభ్యంతరం వ్యక్తం చేసింది.
రజియా సుల్తాన్ ఓ శుక్రవారం నాడు మెహ్రౌలీలోని కువ్వాతుల్ ఇస్లాం మసీద్‌కు వెళ్లి ప్రార్థనలు జరిపారు. ఆ తర్వాత ప్రార్థనల కోసం అక్కడికి వచ్చిన వారందరని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ రాజ్యాధికారం చేపట్టేందుకు తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఆమె కోరారు. అంతే కాకుండా మహిళలు మసీదులకు ఎక్కువగా రావాల్సిందిగా పిలుపునిచ్చారు. రజియా మహిళా పాలకులు అవడం వల్ల ఆమెను రజియా సుల్తానా అని అంటారుగానీ, ఆమె ఎప్పుడూ రజియా సుల్తాన్‌గానే చెప్పుకున్నారు. ఆమె ముఖాన ముసుగు ధరించేది కాదు, ఆమె గుర్రాలపై, ఏనుగులపై స్వారీ చేస్తూ మసీదులు, మదర్సాలను తరచుగా సందర్శించేవారు. నూర్జహాన్ సహా నాటి మొఘల్ రాజుల భార్యలు, పిల్లలు ముఖాన బుర్ఖాలు ధరించిన దాఖలాలు లేవు.
ఒకప్పుడు ముస్లిం మహిళలు మసీదుల్లోకి వెళ్లి ప్రార్థనలు జరపడమే కాకుండా మసీదులను నిర్మించినట్లు కూడా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. మొఘల్ పాలకుడు జలాలుద్దీన్ అక్బర్ పెంపుడు తల్లి మహమ్ అంగా 1561లో ఢిల్లీలో ‘ఖైరుల్ మంజిల్ మసీద్’ను నిర్మించడమే కాకుండా దానికి ఆమె ప్రారంభోత్సవం చేశారు. ఆ మసీదులోని కేంద్ర ద్వారంపై మసీదు నిర్మాతగా మహమ్ అంగా పేరు కూడా చెక్కారు. మసీదులకు ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మహిళలు వెళ్లకపోయినా పండుగలప్పుడు మాత్రం వారు తప్పకుండా వెళ్లేవారట.
ఢిల్లీలో తుగ్లక్ కాలంలో నిర్మించిన వజీరాబాద్ మసీదులో ఓ పక్కన జాలిలాగా రంద్రాలున్న గోడలు ఉన్నాయి. అవి మహిళలు ప్రార్థనలు చేసుకోవడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గోడలని, వారు షాహీ దర్వాజా నుంచి నేరుగా వచ్చి ప్రార్థనలు చేసి, వెళ్లేవారని చరిత్రకారులు చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో నిర్మించిన అదీన మసీదులో కూడా ఓ అర్ద చంద్రాకార ద్వారంతో ఓ జాలి గోడ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అది మహిళల ప్రార్థనల కోసమని సులభంగానే అర్థం అవుతుంది. ఇలా మధ్యకాలం నాటి మసీదుల్లో పాలకులు, మహిళలు ప్రార్థనలు చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆ తర్వాత నిర్మించిన మసీదుల్లో ఆ ప్రత్యేక ఏర్పాట్లు లేకుండా పోవడమే కాకుండా మహిళలు కూడా మసీదులకు రాకుండా పోయారు. సూఫీ మందిరాలు, దర్గాలను కూడా మహిళలు తరచుగా సందర్శించారనడానికి ఆధారాలు ఉన్నాయి. ‘హజ్’ యాత్రలో మధ్య యుగాల నాటి నుంచి నేటి వరకు మహిళలు పాల్గొంటున్నారు. మక్కా, మదీనాలో వారు ప్రార్థనలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.
(గమనిక: మసీదులకు మహిళలు వెళ్లి ప్రార్థనలు జరపడం ఇస్లాంకు వ్యతిరేకం కాదంటూ ముస్లిం పర్సనల్ లా బోర్డు సుప్రీంకోర్టుకు బుధవారం అఫిడవిట్ సమర్పించిన నేపథ్యంలో జియా ఉస్ సలామ్ రాసిన ‘విమెన్ ఇన్ మసీద్: ఏ క్వెస్ట్ ఫర్ జస్టిస్’ పుస్తకంలోని అంశాల ఆధారంగా ఈ వార్తా కథనం)
Comments
Please login to add a commentAdd a comment