'మటన్' మంట
ముంబై : రాష్ట్రంలో బీఫ్ నిషేధంతో మటన్ ధర అమాంతం పెరిగిపోయింది. గత రెండు నెలల్లో రీటైల్ మార్కెట్లో 35 నుంచి 40 శాతం ధరలు పెరిగాయి. డిమాండు పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో మటన్ ధర రూ. 500 పలుకుతోంది. ఏప్రిల్ నెలలో బీఫ్ నిషేధంపై స్టే విధించడానికి బాంబే హైకోర్టు నిరాకరించడంతో రాష్ట్రంలో బీఫ్ భద్రపరచడం, ఎగుమతి, దిగుమతిపై నిషేధం విధించారు. అయితే మూడు నెలల వరకు బీఫ్‌ను బలవంతంగా స్వాధీనం చేసుకోకూడదని అధికారులకు కోర్టు ఆదేశాలిచ్చింది. మూడు నెలల సమయం తర్వాత మటన్ ధర పెరగడం మొదలైంది. ఈ ఏడాది ప్రారంభంలో రూ. 350-రూ.360 కి మటన్ లభించేది. తర్వాత నవీముంబై, ఇతర ప్రదేశాల్లో రీటైల్ మార్కెట్‌లో ధర రూ. 450కి చేరుకుంది. ప్రస్తుతం రూ. 500 కు దొరుకుతోంది.
బీఫ్ నుంచి మటన్‌కు
గత రెండు నెలలుగా కస్టమర్ల సంఖ్య పెరుగతోందని, గతంతో బీఫ్ తినేవారు ఇప్పుడు మటన్ తింటున్నారని నెరూల్‌లోని ఓ వ్యాపారి రఫీక్ ఖురేషి చెప్పారు. డిమాండ్ పెరిగినప్పటికీ అవసరమైన మటన్ అందుబాటులో లేదని మరో వ్యాపారి పేర్కొన్నారు. మేకలు, గొర్ల ధర 10 నుంచి 20 శాతం పెరిగిందని ఆయన అన్నారు. అందుకే ధర పెంచాల్సి వచ్చిందన్నారు. మరో వ్యాపారి మాట్లాడుతూ.. ధరలు మూడు రెట్లు పెరిగినప్పటికీ వినియోగదారులు మాత్రం పెరిగారని చెప్పారు. దేవనార్ వధశాల నుంచి ప్రతిరోజు 3,700 మేకలు, గొర్ల మాంసం వస్తున్నప్పటికీ నవీముంబైలో ఎక్కువ మంది వ్యాపారులు షాపుల్లోనే మేకలు, గొర్లను వధిస్తున్నారు. మరోవైపు ధరలు పెరగడంతో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. ‘గతంలో వారాంతంలో మటన్ తినేవాడిని. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. బీఫ్ నిషేధం తర్వాత మటన్ ధర అమాంతం పెరిగిపోయింది’ అని నెరూల్ వాసి శివరామ్ పేర్కొన్నారు. కాగా, హోళీ పండుగనాటికి ధర రూ. 600 తాకుతోందని వ్యాపారులు చెబుతున్నారు.