చెన్నై వరదల్లో మరణించిన వారికి జపాన్ ప్రధానమంత్రి షింజో అబే ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
న్యూఢిల్లీ: చెన్నై వరదల్లో మరణించిన వారికి జపాన్ ప్రధానమంత్రి షింజొ అబే ప్రగాఢ సంతాపం తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరం కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెన్నై మృతులకు సంతాపాన్ని ప్రకటించారు. మూడవ సారి భారత పర్యటనకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
అటు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, షింజొ పర్యటనను ఆహ్వానిస్తూ ట్వీట్ చేశారు. షింజొ భారతదేశ సందర్శన ఇరుదేశాల సంబంధాలకు కొత్త బలాన్ని, ఉత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్న జపాన్ ప్రధానికి విమానాశ్రయంలో కేంద్రమంత్రి జయంత్ సిన్హా తదితరులు ఘన స్వాగతం తెలిపారు. షింజొ రేపు ప్రధాని మోదీతో కలిసి వారణాసిలో పర్యటించనున్నారు. అనంతరం ఇండో-జపాన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు.