న్యూఢిల్లీ: మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పార్టీని సమాయత్తం చేస్తోంది. రాష్ట్రంలో పార్టీ ప్రచార, సమన్వయ కమిటీలకు నారాయణ్ రాణే, అశోక్ చవాన్ పేర్లను ప్రకటించింది. అలాగే కేంద్ర మాజీ హోం మంత్రి సుశీల్‌కుమార్ షిండేను మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌గా నియమించింది. పై అన్ని కమిటీల్లోనూ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, పీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రే సభ్యులుగా ఉంటారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ బాగా దెబ్బతినడంతో కాంగ్రెస్ కార్యకర్తలు డీలాపడిపోయారు.
దీనికి తోడు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ ప్రతిష్ట రోజురోజుకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో డీలాపడిన కార్యకర్తల్లో నూతనోత్సాహం నింపేందుకు, తద్వారా అసెంబ్లీ ఎన్నికల సమయానికి పార్టీని పటిష్టపరిచేందుకు అధిష్టానం కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగానే రాణే, అశోక్ చవాన్ వంటి అసంతృప్తివాదులను బుజ్జగించి వారికి సముచిత పదవులు ఇవ్వడం ద్వారా పార్టీలో అసంతృప్తిని తగ్గించేందుకు యత్నిస్తోందని పరిశీలకులు అంటున్నారు.
రాణే, అశోక్‌చవాన్‌లకు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో సత్సంబంధాలు లేవనే విషయం అందరికీ తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీ ఘోరపరాజయం తర్వాత ముఖ్యమంత్రిని మార్చాలన్న డిమాండ్‌కు వీరిద్దరూ వంతపాడారు. అలాగే నెల రోజుల కిందట నారాయణ్ రాణే సీఎం పనితీరుపై ఆరోపణలు చేస్తూ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు. పార్టీని సైతం విడుస్తున్నట్లు ప్రకటనలు ఇచ్చారు. అయితే అధిష్టానం అతడిని బుజ్జగించి పార్టీని గాడిలో పెట్టే బాధ్యత అప్పగించడం గమనార్హం. కాగా, కాంగ్రెస్ ప్రచార కమిటీలో 33 మంది సభ్యులుంటారు. వీరిలో మాజీ మంత్రులు అనంత్‌రావ్ థోప్డే, రోహిదాస్ పాటిల్, ఎంపీలు రజ్నీ పాటిల్, అవినాష్ పాండే, మాజీ ఎంపీ మిలింద్ దేవరా వంటివారు ఉన్నారు.
ఇదిలా ఉండగా, సమన్వయ కమిటీలో షిండే, ముకుల్ వాషిక్, రాణే, మురళీ దేవరా, గురుదాస్ కామత్, జనార్ధన్ చందూర్కర్, పతంగ్‌రావ్ కదమ్, హుస్సేన్ దల్వాయీ, కమల్‌తాయి వ్యవహరే, శరద్ రన్పిసే వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అలాగే 39 మంది సభ్యులతో మ్యానిఫెస్టో కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో రాష్ట్ర మంత్రులు బాలా సాహెబ్ థరోట్, హర్షవర్ధన్ పాటిల్, రాధాకృష్ణ విఖే పాటిల్, నితిన్ రావుత్, పార్టీ ఎంపీ, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతవ్, పార్టీ అధికారి ప్రతినిధి అనంత్ గాడ్గిల్ తదితరులున్నారు. పీసీసీ అధ్యక్షుడి నాయకత్వంలో ప్రదేశ్ ఎన్నికల కమిటీని ఏర్పాటుచేశారు.
ఇందులో ముఖ్యమంత్రితోపాటు సీనియర్ నాయకులు షిండే, వాస్నిక్, కామత్, అశోక్ చవాన్, రాణే, విలాస్ ముత్తెంవార్ సతావ్, ప్రియాదత్ సభ్యులుగా ఉంటారు. అలాగే మీడియా, ప్రచార కమిటీకి హర్షవర్ధన్ పాటిల్ చైర్మన్‌గా ఉంటారు. ఇందులో సభ్యులుగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ శుక్లా, సంజయ్ నిరుపమ్, అమిత్ దేశ్‌ముఖ్, రాష్ట్ర హోం సహాయ మంత్రి సతేజ్ పాటిల్ ఉంటారు. కాగా ఈ కమిటీకి సంజయ్ దత్, సచిన్ సావంత్, ఆశిష్ కులకర్ణి సమన్వయ కర్తలుగా వ్యవహరిస్తారు.
ఎన్నికలకు సన్నద్ధం
Published Wed, Aug 13 2014 10:16 PM | Last Updated on Sat, Sep 2 2017 11:50 AM
Advertisement
Advertisement