
'స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకోవాలి'
ఢిల్లీ: దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం దేశరాజధాని ఢిల్లీలో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు జరుగుతున్నాయి. ఎర్రకోటకు చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తొలుత రాజ్‌ఘాట్ వద్ద బాపూజీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటపై జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ప్రధాని జాతీని ఉద్దేశించి ప్రసంగం చేశారు. 125 కోట్ల మంది భారతీయులకు నా శుభాకాంక్షలు' అని తెలిపారు. స్వరాజ్యాన్ని (స్వరాజ్యం అంటే సుపరిపాలన) సురాజ్యంగా మార్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. సంస్కృతి, సంప్రదాయాలకు భారతదేశం పుట్టినిల్లు అని కొనియాడారు.
స్వాతంత్ర్యం వెనక లక్షలాది మహానుభావుల త్యాగఫలం ఉందని గుర్తు చేశారు. దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలని సంకల్పిద్దామని సూచించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని పిలుపునిచ్చారు. కృష్ణుడి నుంచి గాంధీవరకు, భీముడి నుంచి భీంరామ్ అంబేద్కర్ వరకు భారతదేశానికి సనాతన చరిత్ర ఉందని ప్రధాని మోదీ ప్రసంశించారు. ముక్కలైన దేశాన్ని సర్దార్ వల్లభాయి పటేల్ ఏకం చేశారని మోదీ గుర్తు చేశారు.
ప్రధాని ప్రసంగంలోని మరిన్ని ముఖ్యాంశాలు..
♦ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, గ్రామ కార్యదర్శి నుంచి ప్రధాని వరకు అందరూ తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి
♦ టెక్నాలజీతో జనజీవనంలో మార్పులు తేవాలి
♦ సామాన్యుల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యం
♦ ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత కోసమే ఆన్‌లైన్ విధానం
♦ ఒకటి, రెండు వారాల్లోనే పాస్‌పోర్ట్ పొందగలుగుతున్నాం
♦ ఒక్క నిమిషంలో 15 వేల టిక్కెట్లు ఇచ్చేలా రైల్వేను ఆధునీకరించాం
♦ నిరుపేదలకు రైలు ప్రయాణమే ఆధారం
♦ పారిశ్రామిక విధానాల్లో అనేక మార్పులు చేశాం
♦ ఎల్‌ఈడీ బల్బుల వినియోగంతో విద్యుత్ ఆదా
♦ వైద్య వ్యవస్థలో సమూల మార్పులు చేశాం
♦ జన్‌ధన్ యోజన పథకంతో 21 కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు
♦ రైతులకు నీళ్లిస్తే మట్టిలో బంగారం పండిస్తారు
♦ రెండేళ్లు కరువు వచ్చినా తట్టుకుని నిలబడ్డాం