
ఢిల్లీ... హర్యానా పక్కనే ఉంది... రండి
హర్యానా రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు.
హర్యానా: హర్యానా రైతులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. 60 ఏళ్లలో ఏం చేయలేని వారు... నా 60 రోజుల పాలన గురించి ప్రశ్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీని ఎద్దేవా చేశారు. దేశం అభివృద్ది చెందాలంటే కాంగ్రెస్ పార్టీని సాగనంపాలని హర్యానా ప్రజలకు మోడీ హితవు పలికారు. హర్యానా రాష్ట్ర శాసనసభకు ఈ నెల 15న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హర్యానాలోని కర్నల్లో నరేంద్ర మోడీ ఎన్నిక ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ... బీజేపీతోనే అభివృద్ది సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. అన్ని వర్గాల అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు.
కర్ణుడు జన్మించిన నేలపై నుంచి మాట్లాడుతున్నానంటూ ఢిల్లీ... హర్యానా పక్కనే ఉంది.... నేను మీ పక్కనే కూర్చున్నానని... రాష్ట్రంలో బీజేపీని తీసుకురండి... తద్వారా మధ్యవర్తులు లేకుండా మనమంతా మాట్లాడుకుందాం రండి అంటూ మోడీ తన ప్రసంగంతో తనదైన శైలిలో హర్యానా ప్రజలకు ఆకట్టుకున్నారు. ఈ ఎన్నికలు హర్యానా భవిష్యత్ మార్చేవని అన్నారు. హర్యానాలో రియల్ మాఫియాకు చెక్ పెడదామన్నారు. పాడి పంటలు సమృద్ధిగా పండే హర్యానాలో ధాన్యంపై పన్ను విధించిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని మోడీ ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు.